
కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కార్మిక, రైతు, వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఈ నెల 20న నిర్వహిస్తున్నట్లు వైఎస్‌ఆర్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు జాషువా, ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎల్.నాగసుబ్బారెడ్డి, మనోహర్ తెలిపారు. నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం బలవంతపు భూ సేకరణ నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగించి వాటిని వ్యవసాయ కార్మికులు, పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను బలహీన పర్చడం, అమ్మడం మానుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి పొందుతున్న ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌పై ప్రభుత్వం ఆర్థిక దాడికి పాల్పడుతోందని, అన్ని రకాల రుసుము, పెనాల్టీలు, ట్యాక్స్ టోల్ చార్జీలు పెంచి నడ్డి విరుస్తోందన్నారు. అగ్రిగ్రేటర్స్ పేరుతో స్వదేశీ, విదేశీ బహుళ జాతి కంపెనీలకు అనుమతిస్తోందని, వాహన ఫిట్‌నెస్, రెన్యువల్, రిజిస్ట్రేషన్, లైసెన్స్ సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించిందని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేసి పనికి తగిన వేతనం ఇవ్వాలన్నారు. బ్రిటీష్ కాలం నాటి నుంచి కార్మికులు పోరాడి సాధించిన హక్కులను హరించే లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, కెసీ.బాదుల్లా, దస్తగిరిరెడ్డి, అన్వేష్, సుభాషిణి, లక్ష్మీదేవి, పి.సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.