
దివ్యాంగుడి బతుకుపోరాటం
అతడు పుట్టుకతోనే దివ్యాంగుడు. ఎవరిపైనా ఆధారపడకుండా మనోధైర్యంతో పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు. పేద కుటుంబంలో పుట్టినా.. మంచంపట్టిన తల్లిని చూసుకుంటూ తోబుట్టువుల సాయం లేకపోయినా స్వశక్తితో జీవనం సాగిస్తున్నాడు. మూడు చక్రాల బండే తనకు జీవనాధారం. ఆ బండితోనూ తన బ్రతుకు పోరాటం సాగిస్తున్నాడు. ఉన్న సొమ్మంతా తల్లి వైద్యానికి ఖర్చు చేయడంతో ఇపుడు చేతిలో చిల్లిగవ్వలేక కటిక పేదరికంతో అల్లాడిపోతున్నాడు.
బ్రహ్మంగారిమఠం : మండలంలోని ఎద్దులాయపల్లె గ్రామానికి చెందిన పెగడ వెంకటేశ్వర్లు, పెగడ లక్ష్మమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసి పిల్లలను పెంచారు. పెద్దవారిని చేసి వివాహాలు చేశారు. వీరికి దివ్యాంగుడైన చిన్న కుమారుడు వెంకటేశ్వర్లు ఉన్నాడు. కొన్నేళ్ల కిందట భర్త వెంకటేశ్వర్లు చనిపోవడంతో లక్ష్మమ్మ దివ్యాంగ కుమారుడికి తోడుగా ఉండేది. అన్నదమ్ములు ఎవరూ రాకపోయినా.. చిన్న కుమారుడు వెంకటేశ్వర్లు తల్లి ఆలనాపాలనా తనపై వేసుకొని జీవనం సాగించాడు. రెండు కాళ్లు పనిచేయకపోయినా రిక్షాపైనే పనులు చేసుకుంటూ.. తనకు వచ్చే పింఛనుతో జీవనం సాగించాడు. ఇటీవల విధి వంచించింది. అతడి తల్లి లక్ష్మమ్మకు ఏడాది కిందట కిందపడి కాలు విరగడంతో మంచానికే పరిమితమైంది. 105 ఏళ్లు నిండడంతో ఆమె వైద్యం కోసం అప్పు చేసి రూ 2.50 లక్షలు ఖర్చు చేశారు. అన్నదమ్ములు ఆదుకోకపోవడంతో అప్పులు తీర్చలేక, దివ్యాంగుడు కావడంతో ఏమి చేయాలో తోచక కన్నతల్లిని చూసుకుంటూ విలపిస్తున్నాడు వెంకటేశ్వర్లు. దాతలు ఆదుకుంటే తాను తల్లిని కాపాడుకుంటానని వేడుకుంటున్నారు. సాయం చేసేవారెవరైనా 9346687016, 8309431953లో సహకరించాలంటూ కోరుతున్నాడు.
మంచం పట్టిన తల్లిని కాపాడుకోలేక
కన్నీరు మున్నీరు