
కళాశాల గదుల వేలం వాయిదా
ప్రొద్దుటూరు : స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలోని మలయాళస్వామి బీఈడీ కళాశాల గదుల వేలంపాట వాయిదా పడింది. పర్యవేక్షణ అధికారి రాకపోవడంతో వాయిదా వేశామని ఈఓ రామచంద్రాచార్యులు ప్రకటించారు. దీంతో దేవాదాయ శాఖకు మరింత నష్టం వాటిల్లినట్లయింది. అయితే స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ప్రమేయంతోనే వేలంపాట నిర్వహించలేదని, కళాశాల నిర్వాహకులకు అనుకూలంగా సదరు ప్రజాప్రతినిధి వ్యవహరించి ఫోన్ చేయడంతోనే వాయిదా వేశారని చర్చ సాగుతోంది. బహిరంగ వేలం నిర్వహిస్తే ఈ గదులకు నెలకు రూ.లక్ష వరకు ఆదాయం లభించే అవకాశం ఉన్నా.. అధికారుల తీరుతో అందకుండాపోయింది.
ఏడేళ్లుగా అద్దె చెల్లించలేదు
దేవాదాయ శాఖ ఆధ్వర్యం శ్రీకృష్ణ గీతాశ్రమంలో 7,744 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో మలయాళ స్వామి బీఈడీ కళాశాల నిర్వహిస్తున్నారు. ఈ భవనాలకు ఏడేళ్లుగా కళాశాల నిర్వాహకులు అద్దె చెల్లించడం లేదు. కళాశాల యాజమాన్యం గతంలో కోర్టును ఆశ్రయించడంతో గత ఏడాది సెప్టెంబర్ 11న అప్పీల్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో ఈఓ ఏడేళ్ల బకాయిలు రూ.7 లక్షలు చెల్లించాలని పలుమార్లు నోటీసులిచ్చినా నిర్వాహకులు స్పందించలేదు. నాలుగు రోజుల కిందట కళాశాల భవనాలను ఈవో సీజ్ చేసి వేలం నిర్వహిస్తామని ప్రకటన విడుదల చేశారు. విషయం తెలుసుకున్న కళాశాలల నిర్వాహకులు వేలం పాటలో పాల్గొనేందుకు గీతాశ్రమానికి వచ్చారు. అయితే పర్యవేక్షణ అధికారి రాకపోవడంతో వాయిదా వేశామని ఈఓ తెలిపారు. పది రోజుల తర్వాత తిరిగి వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
గతంలోనూ ఇలాగే..
దేవాదాయశాఖకు సంబంధించిన గదులను లోపాయికారీ ఒప్పందాలతో తక్కువ ధరకే అద్దెకు ఇస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. వేలం పాట నిర్వహణను పరిశీలించేందుకు బుధవారం ఆయన ఇక్కడికి వచ్చారు. ఈఓతో ఆయన మాట్లాడుతూ గతంలోలాగే జరుగుతోందని ఇక్కడికి వచ్చానని, ప్రస్తుతం అదే రీతిన వేలం పాట నిర్వహించకుండా వాయిదా వేశారని అన్నారు. గతంలో వేలం జరిపినట్లు రికార్డులు తయారుచేసి అతి తక్కువ బాడుగకు ఇచ్చారని ఆయన తెలిపారు. ఎవరైతే ఆశ్రమానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేశారో వారికే రూములను అప్పజెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పది రోజుల తర్వాత అయినా పారదర్శకంగా వేలం పాట నిర్వహించాలని ఈఓను కోరారు. నిబంధనలకు విరుద్ధంగా దేవాదాయశాఖ ఆదాయానికి గండి కొట్టొద్దని తెలిపారు. ఇలా జరిగితే న్యాయ పోరాటం చేస్తానన్నారు.
అధికార పార్టీ నేత ఒత్తిడే కారణమా?