
భూసార పరీక్ష.. పంట దిగుబడికి రక్ష
వ్యవసాయ డివిజన్‌ల వారీగా మట్టి
నమూనాల సేకరణ లక్ష్యాలు ఇలా ఉన్నాయి
వ్యవసాయ మండలాల నమూనాల
డివిజన్ సంఖ్య సంఖ్య
కడప 6 3366
కమలాపురం 4 3300
పులివెందుల 5 3696
ముద్దనూరు 4 2674
ప్రొద్దుటూరు 4 3107
మైదుకూరు 4 2904
బద్వేలు 4 1814
పోరుమామిళ్ల 5 3427
మొత్తం 36 24,288
వల్లూరు : భూసార పరీక్షలను నిర్వహించుకుని భూముల స్వభావం, అందులోని పోషక విలువల ఆధారంగా తగిన పంటలను ఎంపిక చేసుకుని సాగులో మెలకువలు పాటించడం వలన అధిక దిగుబడులను సాఽధించడానికి అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు తెలుపుతున్నారు. నేలలు తమలో సహజంగా ఇమిడి వున్న పోషక పదార్థాలతోబాటు మనం అదనంగా వేసే సేంద్రీయ , రసాయనిక ఎరువుల్లోని పోషకాలను పంటలకు అందజేస్తాయి. ఈ పోషక విలువలతో బాటు భూమిలోని చౌడు గుణం, సున్నం శాతం, నేల కాలుష్యం మొదలైన వాటి స్థాయిలను తెలుసుకోవడానికి భూసార పరీక్ష ఉపయోగపడుతుంది. అంతేగాక నేలల్లో వివిధ రకాల నేలలు వుండగా అందులో కొన్ని రకాల నేలల్లో ప్రత్యేకించి కొన్ని పంటలు సాగుకు అనుకూలంగా వుండి మంచి దిగుబడులు వస్తాయి. భూమి స్వభావాన్ని తెలుసుకోవడం ద్వారా అందుకు తగిన పంటలను సాగు చేసి మంచి ఫలితాలను పొందవచ్చు.
సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి..
కనీసం రెండు లేక మూడు సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలను చేయించుకుని తమ పొలాల్లోని వివిధ పోషక పదార్థాల విలువలను తెలుసుకోవడం ద్వారా తగిన మోతాదులోనే ఎరువులను వాడడానికి అవకాశం ఉంటుంది. దీని వలన అవసరమైన పోషకాలను మాత్రమే పంటలకు అందించడం వలన అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతే కాక భూమిలో నిల్వ ఉన్న వివిధ పోషకాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఆశించిన దిగుబడులను పొందవచ్చు.
సరైన పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తేనే ఫలితం..
కాగా భూసార పరీక్ష నిర్వహించడంలో సరైన పద్ధతిని పాటిస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. కావున భూసార పరీక్షలు నిర్వహించేటపుడు రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.
● పొలంలో ఇంగ్లీషు వీ అక్షరం ఆకారంలో 15 సెం, మీ వరకు పారతో గుంత తీసి అందులో పై పొర నుండి కింది పొర వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి.
● ఒక ఎకరా విస్తీర్ణంలో 8 నుండి 10 చోట్ల సేకరించిన మట్టిని ఒక చోట చేర్చి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదురెదురుగా వున్న భాగాలను తీసుకుని మిగిలిన భాగాలను తీసి వేయాలి. ఇదే విధంగా మట్టి పరిమాణం 1/2 కిలో వచ్చే వరకు చేయాలి.
● సేకరించిన మట్టిలో రాళ్లు, వేర్లు లేకుండా చేసి నీడలో ఆరబెట్టాలి.
● మట్టి నమూనా సేకరణకు రసాయనిక, సేంద్రీయ ఎరువులకు ఉపయోగించిన సంచులను వాడరాదు.
● గట్ల దగ్గర, పంట కాల్వలలో, చెట్ల కింద, ఎరువులను కుప్పలుగా వేసిన చోట, ఎప్పుడూ నీరు నిల్వ వుండే ప్రదేశంలో మట్టి నమూనాను సేకరించరాదు.
● పొలంలో చౌడు ప్రాంతం ఉన్నట్‌లైతే ప్రత్యేకంగా నమూనాను తీసి పంపాలి.
● పండ్ల తోటల సాగుకు పంట రకాన్ని బట్టి 3 నుండి 6 అడుగుల లోతు వరకు గుంతను తీసి ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి పంపాల్సి ఉంటుంది.
రైతులకు ఉపయుక్తంగా
భూసార పరీక్షా పత్రాలు..
సేకరించిన మట్టి నమూనాలను అందుబాటులోని భూసార పరీక్షా కేంద్రాలకు పంపితే వారు పరీక్షలు నిర్వహించి వివిధ పోషక విలువల శాతాన్ని నమోదు చేస్తారు. వీటిని కార్డులలో పొందుపరిచి రైతులకు అందచేస్తారు. ఇందులో ఉదజని సూచిక, లవణ సూచిక, సేంద్రీయ కర్బణంలతో బాటు ప్రధాన పోషకాలైన నత్రజని, బాస్వరం, పొటాషియం, సూక్ష్మ ధాతు పోషకాలైన గంధకం, జింక్, బోరాన్, ఇనుము, మాంగనీసు, రాగి వంటి వాటి విలువల శాతాన్ని నమోదు చేస్తారు. దీనితో బాటు సాధారణంగా అవి ఉండాల్సిన శాతాన్ని బట్టి పరీక్షల్లో నమోదైన విలువల స్థాయిలను తక్కువ, ఎక్కువ, సాధారణం, మధ్యస్థం, అతి తక్కువ, అతి ఎక్కువ వంటి వివరాలతో సూచిస్తారు. వీటిని ఆధారంగా చేసుకుని పంటలకు వాడాల్సిన ఎరువుల మోతాదులను, వాడే విధానాలను సైతం సూచిస్తారు. ఇవి పాటించడం వలన రైతులు పంటల సాగులో ఖర్చులను తగ్గించుకుని నికర ఆదాయాన్ని పెంపొందిచుకునే అవకాశాలు వున్నాయి.
ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో భూసార పరీక్షల నిర్వహణకు గానూ మట్టి నమూనా సేకరణను ఇప్పటికే ప్రారంభించారు. గత ఏడాది మట్టి నమూనాల సేకరణ లక్ష్యం 17800 కాగా, 2025– 26 సంవత్సరానికి గానూ జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో మొత్తం 24,288 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో
మట్టి నమూనాల సేకరణ ప్రారంభం
జిల్లా లక్ష్యం – 24,288 నమూనాలు
భూసార పరీక్షతో ప్రయోజనాలు..
భూసార పరీక్ష చేయించుకుని నేల స్వభావాన్ని బట్టి పంటలను సాగు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. భూమిలోని పోషకాల విలువలను తెలుసుకోవడం ద్వారా అవసరమైన పోషకాలను మాత్రమే ఎరువుల రూపంలో వాడవచ్చు. దీంతో అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంది.
– ఏవీ నరసింహారెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు, కమలాపురం

భూసార పరీక్ష.. పంట దిగుబడికి రక్ష