
హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలు శిక్ష
కడప అర్బన్ : కడప నగరం ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏడురోడ్ల సమీపంలో జనతా మెడికల్ స్టోర్ వద్ద నివాసముంటున్న సులోచనపై అతని సోదరుడు, సిద్దవటం మండలం మంగనవాండ్లపల్లికి చెందిన కారుమంచి సురేష్ అలియాస్ హరిప్రసాద్ నాయుడు 2020 ఫిబ్రవరి 2వ తేదీన మటన్‌కొట్టే కత్తితో తలపై, భుజంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలు సులోచనకు ఆమె భర్త రాఘవరెడ్డి చికిత్స చేయించారు. కేవలం తన అవసరాలకు డబ్బులు ఇవ్వలేదని సోదరుడు ఈ చర్యకు పాల్పడినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ బి.మధుసూదన్‌రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఈ సంఘటనపై నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు, రూ.70 వేలు జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సివిల్ జడ్జి జి.జి ఆసిఫా సుల్తానా తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.శ్రీనివాసులు తమ వాదనలను వినిపించారు. ఈ కేసు వివరాలను ప్రస్తుత సీఐ బి. రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. తగిన సాక్ష్యాధారాలతో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ అభినందించారు.