చింతకొమ్మదిన్నె : కడప నుంచి రాయచోటికి ఆర్టీసీ బస్సులో మంగళవారం ప్రయాణిస్తూ గుర్తు తెలియని ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడని చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపారు. కడపలో ఆర్టీసీ బస్సు ఎక్కి రాయచోటికి టిక్కెట్ తీసుకొని బస్సులో వెళ్తుండగా, చింతకొమ్మదిన్నె మండలంలోని మూలవంక గ్రామం వద్దకు రాగానే ప్రయాణికునికి గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు 108లో తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన ప్రయాణికుని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్‌ఎంపీ క్లినిక్ సీజ్
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక శ్రీరాంనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సుబ్బ య్య ఆర్‌ఎంపీ క్లినిక్‌ను మంగళవారం వైద్యాధికారులు సీజ్ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శివప్రసాద్‌రెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. చిన్న పిల్లలకు వైద్యం అందించడంతో పాటు రెండు బెడ్లను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. దీంతో ఆర్‌ఎంపీ క్లినిక్‌ను సీజ్ చేస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆలీం, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న ఏఎస్‌ఐ
చాపాడు : స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐ గా పని చేస్తున్న అహమ్మద్ బాషా మానవత్వం చాటుకున్నారు. మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని నాగులపల్లె సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద శనివారం మధ్యాహ్నం బైకు స్కిడ్ అయి శివ అనే వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. డ్యూటీ ముగించుకుని ప్రొద్దుటూరుకు వెళుతున్న ఏఎస్‌ఐ స్పృహ తప్పి పడిపోయిన శివకు సపర్యలు చేసి ఆటోలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి ప్రొద్దుటూరు పట్టణం పెన్నానగర్‌కు చెందిన వాడిగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆదుకున్న ఏఎస్‌ఐను పలువురు అభినందించారు.

ఆర్‌ఎంపీ క్లినిక్ సీజ్