
ఈఓ నివేదికను తొక్కిపెట్టింది ఎవరు?
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని కోట్లరూపాయలు విలువైన ఆస్తులు గల శ్రీకృష్ణ గీతాశ్రమం నిర్వహణపై ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా చర్యలు తీసుకునే వారు కరువయ్యారు. పట్టణానికి చెందిన నామా ఎరుకలయ్య 1946లో లోక కల్యాణార్థం ఆశ్రమాన్ని నెలకొల్పారు. సంస్థ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్య, భోజన సదుపాయం, వసతి ఏర్పాటు చేయడం, గో సంరక్షణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం, భగవద్గీతను ప్రచారం చేయడం ఆయన ప్రధాన ఆశయాలు. అనంతరం 1982 జనవరి 1న ఆశ్రమానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగించి ఆయన ఫౌండర్ ట్రస్టీగా ఉండేవారు. 1989లో ఈ ఆశ్రమాన్ని చిత్తూరు జిల్లా ఏర్పేడులోని శ్రీవ్యాసాశ్రమంలో చేర్చారు. ఆశ్రమ నిర్వహణకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో పలు ఆరోపణలు రావడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీవ్యాసాశ్రమం దత్తత నుండి తప్పించి ప్రత్యేకంగా ఈఓను నియమించారు. 2017 జూన్ 19వ తేదీ నుండి ఈఓ ద్వారానే ఆశ్రమం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మొత్తం ఆశ్రమ నిర్వహణకు సంబంఽధించి కమిషనర్ ఆదేశాల మేరకు గతంలో ఈఓగా పనిచేసిన శంకర్‌బాలాజీ ఒక నివేదికను తయారు చేసి పంపారు.
కోర్టును ఆశ్రయించిన వారికే లీజుకు..
గీతాశ్రమం ప్రాంగణంలోని శారద జూనియర్ కాలేజీకి సంబంధించి మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో 2021 ఆగస్టు 12న ఈ భవనాలకు అధికారులు వేలం పాట నిర్వహించారు. ఈ బహిరంగ వేలంలో కళాశాల యాజమాన్యం ప్రతినిధులు ఎవరిని పాట పాడనివ్వకుండా, వారు పాల్గొనకుండా వాయిదా వేయించారు. తమ కళాశాలకే ఈ భవనం 11 ఏళ్లపాటు లీజుకు కావాలని లేఖ సమర్పించారు. గతంలో కేవలం రూ.16,500 మాత్రమే కళాశాల యాజమాన్యం అద్దె చెల్లిస్తుండగా దీనిని 33 శాతం పెంచి రూ.21,945 ప్రకారం అద్దె చెల్లించాలని కమిషనర్ ఆదేశించారు. పలు మార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోగా ఏ ప్రకారం అద్దె చెల్లిస్తారో చెప్పలేదని ఈఓ నివేదికలో పేర్కొన్నారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన ప్రొద్దుటూరులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చదరపు అడుగుకు రూ.5.50 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.2.45 మాత్రమే చెల్లిస్తున్నట్లు నివేదికలో తెలిపారు. ముందుగా కళాశాల యాజమాన్యానికి, దేవాదాయశాఖకు ఎలాంటి కోర్టు కేసులు లేకపోగా.. కళాశాల కరస్పాండెంట్ ఎం.సురేష్‌బాబు పలు ఆరోపణలు చేస్తూ హైకోర్టులో రెండు కేసులు వేశారు. ఈ కేసులను సైతం హైకోర్టు కొట్టివేసింది. ఆశ్రమంలోని బీఈడీ కళాశాల, డైట్ కళాశాలలను ఏర్పాటు చేసి గతంలో దేవాదాయశాఖ వారికి అప్పగించారు. కాగా 2020లో గంగాధరానందగిరి స్వామి మరణానంతరం అక్రమంగా ఈ భవనాలను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో కోర్టులో కేసు వేశారు. శారద జూనియర్ కళాశాల కరస్పాండెంట్ నిర్వాకం వలన ప్రతి నెల సుమారు రూ.30వేలు ఆశ్రమానికి నష్టం వాటిల్లుతోందనే విషయాన్ని ఈఓ ఉన్నతాధికారులకు తెలిపారు. ఇది ఇలా ఉండగానే ప్రస్తుత అధికారులు గీతాశ్రమంపై కోర్టులో కేసు వేసిన ఎం.సురేష్‌బాబుకు ఈ ఏడాది ఫిబ్రవరి 8న బహిరంగ వేలం నిర్వహించినట్లుగా ప్రకటించి భవనాలను అద్దెకు ఇచ్చారు. వాస్తవానికి ఆశ్రమంపై కోర్టుకు వెళ్లిన వ్యక్తికి తిరిగి ఎలా బహిరంగ వేలం ద్వారా ఎలా అద్దెకు ఇస్తారన్న విషయంపై విచారణ చేపట్టాల్సి ఉంది. గతంలో అధికారులు తొలగించిన కార్యాలయ సిబ్బంది జనార్దన్‌ను ప్రస్తుతం తిరిగి విధుల్లోకి తీసుకోవడమే కాకుండా ఆయనకు ఏకంగా పాత బకాయిలను కూడా చెల్లించడం వెనుక మర్మం ఏమిటో తెలియడం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న ఈఓ రామచంద్రాచార్యులు ఈనెలాఖరున పదవీ విరమణ చెందనున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గత ఈఓ సమర్పించిన నివేదికను పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలను తెలుసుకుని ప్రభుత్వానికి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గీతాశ్రమంపై కోర్టుకు వెళ్లిన వారికే భవనాలు లీజుకు
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులు