
అవయవదానంతో అందరికీ ఆదర్శం
చిన్నమండెం : చిన్నమండెం మండలం చాకిబండ గ్రామం అంపాబత్తునివారిపల్లెకు చెందిన మద్దిరాల కంచంరెడ్డి, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు మద్దిరాల కొండారెడ్డి(21) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అతని అవయవాలు దానం చేసి మరికొందరి ప్రాణాలను కాపాడి ఆ కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది. స్థానికుల కథనం మేరకు.. మద్దిరాల కొండారెడ్డి బెంగళూరులో సివిల్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 8వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందాడు. వైద్యుల సూచనల మేరకు కొండారెడ్డి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసి మరికొందరి ప్రాణాలను నిలబెట్టే దిశగా ఆలోచించారు. కొండారెడ్డికి సంబంధించిన గుండె, లివర్, కిడ్నీలు తదితర అవయవాలు దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
కన్నవారి కలలు కల్లలైనా..
కుమారుడి చదువు కోసం తల్లిదండ్రులు కంచంరెడ్డి, కోటేశ్వరమ్మలు ఎన్నో ఏళ్లుగా కష్టపడి వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నారు. కూలి డబ్బులతోనే కుమారుని, కుమార్తెను చదివించుకున్నారు. కుమారుడు కొండారెడ్డి సివిల్ ఇంజనీర్‌గా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడనే సంతోషం ఆ కుటుంబానికి చాలా రోజులు నిలబడలేదు. విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం ఉన్న ఒక్క కుమారుడిని పోగొట్టుకుంది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు చాకిబండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంతటి విషాదంలో కూడా వారు తమ కుమారుడి అవయవాలు దానం చేసి మరి కొందరి ప్రాణాలను కాపాడటం ఎంతో గర్వంగా ఉందని చెప్పడం అందరినీ కదిలించింది.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
బ్రెయిన్‌డెడ్ తర్వాత పలు
అవయవాలు దానం

అవయవదానంతో అందరికీ ఆదర్శం