
కూటమి ప్రభుత్వంలో బీసీలకు రక్షణ లేదు
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వంలో బీసీలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ అన్నారు. మంగళవారం వైస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులు బసవరాజు, సుబ్బారాయుడు లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. మాజీమంత్రి, బీసీ సామాజిక వర్గానికి చెందిన విడదల రజని పట్ల సర్కిల్ ఇన్స్‌పెక్టర్ సుబ్బానాయుడు దురుసుగా ప్రవర్తించడాన్ని వైస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రౌడీలా వ్యవహరించిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ నాయకుడు సింధే రవిచంద్రరావు పాల్గొన్నారు.