
ప్రభుత్వం ఏకపక్ష ధోరణి విడనాడాలి
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల అండదండతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబులు అన్నారు. పాఠశాల విద్యాశాఖలో ప్రస్తుతం చేపడుతున్న పాఠశాలల పునః వ్యవస్థీకరణ, బదిలీల, పదోన్నతుల ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందని ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కడపలోని డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 117 జీఓను రద్దుచేసి, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షిస్తామని పదేపదే హామీలు గుప్పించిన పాలకులు, జీఓను బేషరతుగా రద్దు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఈ నెల 15వ తేదీన విజయవాడలోని విద్యా భవన్‌ను ముట్టడిస్తామని వ హెచ్చరించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ, జాస్ అహ్మద్, మురళీకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు క్రిష్ణారెడ్డి, రూతు ఆరోగ్య మేరి, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.