జమ్మలమడుగు: నారాపురస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా టీటీడీ నారాపుర స్వామి ఆలయంలో ఆదివారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. స్వామి వారి ఆలయం ముందున్న ధ్వజ స్థంభానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి ఊంజల్ సేవతోపాటు పెద్ద శేష వాహనంపై ఊరేగించారు.
గంగమ్మా..కరుణించమ్మా..
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. తలనీలాలు అర్పించారు. గంగమ్మా..వర్షాలు సకాలంతో కురిపించమ్మా...కరుణించి.. కాపాడు తల్లీ అంటూ వేడుకున్నారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు.
నేటి నుంచి అన్నమాచార్యుడి జయంత్యుత్సవాలు
రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు 617 జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ తాళ్లపాక, 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద ఏర్పాట్లను పూర్తిచేసింది. ఈనెల 18వరకు ఉత్సవాలు జరుగుతాయని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు అధికారులు తెలిపారు. తొలిరోజు గోష్టిగానంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తాళ్లపాక ధ్యానమందిరం ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాట్లు చేశారు.

భక్తిశ్రద్ధలతో ధ్వజారోహణం