
కమణీయం.. శ్రీ నారసింహుడి కల్యాణం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఆదివారం శ్రీ నృసింహస్వామి జయంతి వేడుకలను పురస్కరించుకొని స్వామివారికి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. ఆలయంలో చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లి వేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి రాభిషేకం చేశారు. రంగురంగుల పుష్పాలతో స్వామివార్లను అలంకరించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ముత్యాల తలంబ్రాలతో స్వామివారి పెళ్లి వేడుక నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మేళతాళాలతో శాస్త్రోక్తంగా మాంగల్యధారణ కావించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారి ఎదుట యజ్ఞహోమాలు జరిపారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గోపాల బట్టార్, కృష్ణరాజ బట్టార్, అనిల్‌స్వామి, గోకుల్‌స్వామి పాల్గొన్నారు.
ఘనంగా తరిగొండ వెంగమాంబ,
నృసింహ జయంతి
మండలంలోని తరిగొండలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 255వ జయంతి, నృసింహస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రియ భక్తురాలైన ప్రముఖ రచయిత్రి వెంగమాంబ జన్మస్థలం తరిగొండ గ్రామం. ఇక్కడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలోనే వెంగమాంబ ఆలయం ఉంది. వెంగమాంబ, నరసింహస్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఉదయం 6 గంటలకు స్వామివారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కావించారు. వేదపండింతుల మంత్రోచ్ఛారణల మధ్య మహా స్నపనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగమాంబ ఆలయాన్ని రంగు రంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. అమ్మవారికి పలు రకాల నైవేద్యాలను సమర్పించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలతో పురవీధుల గుండా స్వామివార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. టీటీడీకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల చేత మాతృశ్రీ వెంగమాంబ సంకీర్తన గోష్టిగానం, హరికథా కాలక్షేప కార్యక్రమాలు నిర్వహించారు. వెంగమాంబ, నృసింహ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు.
గుర్రంకొండలో..
మండల కేంద్రమైన గుర్రంకొండలో నృసింహస్వామి జయంతి వేడుకలు రెండేళ్ల తరువాత ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక చరిత్రాత్మక గుర్రంకొండ కోట పైభాగంలో ఉన్న శ్రీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలను జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు కిరణ్‌కుమార్‌శర్మ పాల్గొన్నారు.

కమణీయం.. శ్రీ నారసింహుడి కల్యాణం

కమణీయం.. శ్రీ నారసింహుడి కల్యాణం