
మిల్లర్ మీదపడి రోడ్డు నిర్మాణ కూలి మృతి
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గోపిరెడ్డిపల్లెకు సమీపంలో నెల్లూరు– బళ్లారి బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న చోట ఆదివారం మిల్లర్ మీద పడి ఎండీ వసీం (23) అనే కూలి మృతి చెందాడు. గోపిరెడ్డిల్లెకు సమీపంలోని శివపురం రహదారి వద్ద కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఆదివారం పనుల్లో భాగంగా మిల్లర్ నుంచి కాంక్రీట్ వేస్తున్న సమయంలో మిల్లర్ ఒరిగి పక్కనే ఉన్న వసీంపై పడింది. మిల్లర్ కింద పడిన ఆ యువకుడు నుజ్జు నుజ్జుగా మారి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాకు చెందిన వాడిగా తెలుస్తోంది. ఆష్రాఫ్, ఫైజర్ అనే వారు ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. మైదుకూరు అర్బన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.