సొంతంగా ఏ పని చేసుకోలేని వారు.. కొందరు పుట్టుకతో.. ఇంకొ
● సదరంలో దివ్యాంగుల అగచాట్లు
● కుటుంబ సభ్యుల అపసోపాలు
● అర్హత ఉన్నా తప్పని పునఃపరిశీలన
● అందుబాటులో లేని వీల్‌చైర్లు, స్ట్రెచర్లు
● రిమ్స్‌లో కనీస సౌకర్యాలు కరువు
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సర్టిఫికెట్ల పునః పరిశీలన కోసం వస్తున్న దివ్యాంగులలో దయనీయస్థితిలో వున్నవారు లేకపోలేదు. ఇందుకు ప్రత్యక్షంగా ఈ నెల 2,3 తేదీలలో ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. మంచానికి, వీల్‌చైర్‌లకే పరిమితమై, వారి వ్యక్తిగత పనులను కూడా కుటుంబ సభ్యులపై ఆధారపడి జీవించే వారిని కూడా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో నోటీసులు ఇచ్చి కడప రిమ్స్‌కు రప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు దివ్యాంగుల జాబితాను తగ్గించే దిశగా.. రాష్ట్ర వ్యాప్తంగా వారిని మరలా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో తమ సమీపంలో మెడికల్ బోర్డ్ వున్న ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ప్రతి మనిషికి కనిపించగానే.. ప్రత్యక్షంగా వీరికి వికలత్వం వుందని ఇట్టే తెలిసిపోతుంది. కానీ అలాంటి వారిని కూడా వదిలిపెట్టకుండా ‘రీ వెరిఫికేషన్’ నోటీసులను ఇచ్చి వేధింపులకు గురి చేయడం ఎంత వరకు సమంజసమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● రిమ్స్ ఓపీ విభాగానికి ఎదురుగా ఏర్పాటు చేసిన షామియానా, కుర్చీలను ‘రీ వెరిఫికేషన్’కు వస్తున్న దివ్యాంగుల కోసం వినియోగిస్తున్నారు. అయితే వేసవి కాలంలో కనీసం తాగేందుకు ‘మంచినీటి’ సౌకర్యం కూడా కల్పించకపోవడం దారుణం. అసలే మూడు రోజులుగా ఓపీ క్యాంటీన్‌ను మూసివేయడం వల్ల అక్కడికి వస్తున్న రోగులకు, వారి సహాయకులకు కనీసం అల్పాహారం, టీ, కాఫీ, మజ్జిగ, నీటి సౌకర్యం కరువయ్యాయి. రిమ్స్ అధికారులు గానీ, డీఆర్‌డీఏ విభాగానికి చెందిన అధికారులైనా స్పందించి నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
● ఒకవైపు నానా తిప్పలు పడి అక్కడికి ‘రీ వెరిఫికేషన్’కు వస్తున్న దివ్యాంగుల పాలిట కొందరు ‘చిరుద్యోగుల’ చేష్టలు కూడా శాపంగా మారుతున్నాయి. ‘రీ వెరిఫికేషన్’ చేయించుకునేందుకు వచ్చిన వారికి ‘తప్పకుండా’ మరలా సర్టిఫికెట్‌ను యథావిధిగా చేయిస్తామని మాయమాటలను చెప్పి తమ జేబులను నింపుకొంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కో ‘రీ వెరిఫికేషన్’ సర్టిఫికెట్ కోసం వేలాది రూపాయలను వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. వీల్‌చైర్, స్ట్రెక్చర్‌ల కొరత స్పష్టంగా తెలుస్తోందని పేర్కొంటున్నారు.
● దివ్యాంగుల కష్టాలు, ఇబ్బందులపై సీఎస్ ఆర్‌ఎంఓ డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఎవరైనా తమకు ఫిర్యాదు చేసినా, తమ దృష్టికి వచ్చినా చర్యలను తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే ‘రీ వెరిఫికేషన్’కు దివ్యాంగులను పిలిపిస్తున్నామని వివరణ ఇచ్చారు.


