ఉగాది పురస్కారాలు అందుకున్న జిల్లా వాసులు
కడప కల్చరల్ : విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాలను ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. ఆయనతోపాటు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, అవధాని మాడగుల నాగఫణిశర్మ తదితరులు ఈ పురస్కారాలను కళాకారులకు అందజేశారు.
కడప నగరానికి చెందిన డాక్టర్ చింతకుంట శివారెడ్డి, మొగిలిచెండు సురేష్, బద్వేలుకు చెందిన విద్వాన్ గానుగపెంట హనుమంతరావు, ప్రొద్దుటూరు వాసి జింకా సుబ్రమణ్యం, సాహిత్య విభాగంలో ఉగాది పురస్కారాలను అందుకున్నారు. నిర్వాహకులు వారికి తెలుగు తల్లి విగ్రహం, రూ.10 వేలు చెక్కు అందజేసి ఘనంగా సత్కరించారు.
రైతు పండింటి కృష్ణమూర్తికి..
కడప అగ్రికల్చర్ : కడప నగర శివార్లలోని ఊటుకూరు కృషి విజ్ఞానకేంద్రం, ఏరువాక కేంద్రం అభ్యుదయ రైతు పండింటి కృష్ణమూర్తి ఉగాది పురస్కారం అందుకున్నారు. వ్యవసాయ సాగులో ఆచరిస్తున్న వినూత్న పద్ధతులకు గుంటూరు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు 2024 సంవత్సరానికి రాయలసీమ ప్రాంతం తరపున ఎంపిక చేశారు. ఉగాది పండుగలను పురస్కరించుకుని ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఉగాది వేడుకల్లో రైతు పండింటి కృష్ణమూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతోపాటు రూ. 5 వేలు నగదు పురస్కారంతో సత్కరించారు.
వేంపల్లి షరీఫ్‌కు..
వేంపల్లె : వేంపల్లె పట్టణానికి చెందిన ప్రముఖ కథా రచయిత డాక్టర్ వేంపల్లె షరీఫ్ ఆదివారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. పదివేల రూపాయల నగదు, శాలువా, మెమెంటోతో ముఖ్యమంత్రి ఆయనను సన్మానించారు. షరీఫ్ రెండున్నర దశాబ్దాలుగా సాహిత్య రంగంలో ఉన్నారు. ముఖ్యంగా కథా రచనలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నాలుగు కథా సంపుటాలు వెలువరించారు. మరో మూడు కథా సంకలనాలకు సంపాదక బాధ్యతలు నిర్వర్తించారు.
శ్రీరామ్‌కుమార్ శర్మకు..
పులివెందుల టౌన్ : ఉగాది సందర్భంగా ఆదివారం కడప కలెక్టరేట్ సభా మండపంలో జరిగిన ఉగాది సంబరాల్లో పులివెందులకు చెందిన వేద పండితుడు, పురోహితుడు, పంచాంగం రామ్‌కుమార్ శర్మకు పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో శాసన సభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి, పుట్టా సుధాకర్, యాదవ్, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, దేవదాయ శాఖ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉగాది పురస్కారాలు అందుకున్న జిల్లా వాసులు
ఉగాది పురస్కారాలు అందుకున్న జిల్లా వాసులు
ఉగాది పురస్కారాలు అందుకున్న జిల్లా వాసులు


