
No Headline
కడప ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాల్లోని పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన చిన్నారులకు ఉన్నత విద్యను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఉన్న ఊరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు తగినన్ని వసతులను కల్పించి హైస్కూల్ ప్లస్‌గా మార్చింది. చాలామంది తల్లిదండ్రులు పదోతరగతి తర్వాత తమ పిల్లలను ఊరికి దూరంగా ఉన్న కళాశాలల్లో చేర్పించాలంటే తలకు మించిన భారం కావడంతో చదువులు మాన్పిస్తున్నారు.ఇందులో బాలికలే అధికంగా ఉంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం మనబడి నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి సకల సౌకర్యాలు కల్పించింది. ప్రభుత్వ పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా మార్చడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్స్ తగ్గడంతోపాటు బాలికలు కూడా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఇంటర్ విద్య దూరం..
గతంలో గ్రామీణ ప్రాంతాలకు సమీపంలో జూనియర్ కళాశాలలు లేని కారణంగా అనేక మంది విద్యార్థులు ఇంటర్ విద్యకు దూరమయ్యారు. ఇది గమనించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లోనే కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, ఏపీ మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. ఇంగ్లీషు మీడియంలో ఇంటర్ విద్యను అందుబాటులోకి తెచ్చారు.తర్వాత వచ్చిన పాలకులు ఇంటర్ విద్య ఏర్పాటుపై ఎటువంటి శ్రద్ధ తీసుకోలేదు. దీంతో గ్రామీణ ప్రాంతానికి చెందిన చాలామంది ఇంటర్ విద్యకు దూరమయ్యారనే అరోపణలు ఉన్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తొలుత జిల్లాకు చెందిన 14 ఉన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసి హైస్కూల్ ప్లస్ పేరుతో ఇంటర్మీడియట్ కోర్సులను ప్రారంభించారు. దీంతో గ్రామీణ ప్రాంతానికి చెందిన చాలా మంది విద్యార్థులు ఇంటర్ విద్యను అభ్యసించగలిగారు. ఇంటర్ విద్యను మరికొందరికి దగ్గర చేసే కార్యక్రమంలో భాగంగా తాజాగా మరో 20 ఉన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసి హైస్కూల్ ప్లస్‌గా మార్చారు. ఇందులో 18 పాఠశాలలను కో–ఎడ్యుకేషన్ హైస్కూల్ ప్లస్‌గా మార్చగా రెండింటిని ప్రత్యేకంగా బాలికల హైస్కూల్ ప్లస్‌గా మార్చారు.
గతంలో మంజూరైనవి: జిల్లాలో గతేడాది 14 ఉన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసి హైస్కూల్ ప్లస్‌గా మార్చారు. ఇందులో 10 హైస్కూల్ ప్లస్ పాఠశాలలను మాత్రమే ప్రారంభించారు. ఏర్పా టు చేసిన హైస్కూల్ ప్లస్‌లో విద్యార్థుల సంఖ్య కు తగ్గట్టుగా అధ్యాపకులను కూడా నియమించారు.సీకేదిన్నె, తొండూరు, ఎగువ లింగాల, వేపరాల(మైలవరం) హైస్కూల్‌ను మాత్రం ప్రారంభించలేదు. గతేడాది ప్రారంభించకుండా వదిలేసిన ఈ నాలుగింటిని ఈ సంవత్సరం హైస్కూల్ ప్లస్‌గా తిరిగి ప్రారంభించనున్నారు.
ఒక్కో స్కూల్‌లో రెండు గ్రూపులు..
ప్రస్తుతం ఇంటర్మీడియట్‌లో డిమాండ్ ఉన్న ఎంపీసీ, బైసీపీ, సీఈసీ గ్రూపులను జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది ఒక్కో స్కూల్లో ఏదేని రెండు గ్రూపులకే ప్రవేశాలను నిర్వహిస్తారు. ప్రతి గ్రూపులో 40 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఒక్కో పాఠశాలలో 80 మంది విద్యార్థిని, విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకున్నారు. హైస్కూల్ ప్లస్‌గా ఎంపిక చేసిన పాఠశాలలో కళాశాల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించనున్నారు.ఆయా మండలాల పరిధిలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ స్కూళ్ల ఏర్పాటుతో ఉన్నత విద్య చేరువకానుంది.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోఇంటర్మీడియట్ చదువులు
పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరం
జిల్లాకు తాజాగా 20 హైస్కూల్ ప్లస్ పాఠశాలలు మంజూరు

No Headline