ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
అభ్యర్థుల తరఫున ముఖ్యనేతలు..
సాక్షి,యాదాద్రి: రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం తెరపడింది. చివరి రోజు ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచా రంతో హోరెత్తింది. వారం రోజులుగా అభ్యర్థులు వ్యూహప్రతివ్యూహాలతో ప్రచారం సాగించారు. వారి తరఫున ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. ప్రచారం ముగియడంతో తెరవెనుక మంత్రాంగం ప్రారంభమైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థులు పంపకాలకు తెరతీశారు. ఓటుకు నోటు, మద్యం, చీరలు, ఇతర గిఫ్టుల పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.
మెజార్టీ స్థానాలపై గురి
మలి విడతలో భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల్లోని 150 పంచాయతీలు, 140 వార్డులకు గాను.. అందులో 10 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 140 పంచాయతీలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మరిన్ని స్థానాలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. తొలి విడతలో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. అయితే పలుచోట్ల రెండు పార్టీల మద్దతుదారుల విజయానికి సమన్వయ లోపంతో పాటు రెబల్స్ గండికొట్టారు. ఈ నేపథ్యంలో రెబల్స్‌ను దారికి తెచ్చుకునే ప్రయత్నంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి.
హెచ్‌ఎండీఏ మండలాల్లో రూ.కోట్లలో ఖర్చు
జనరల్, బీసీ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ముఖ్యంగా హెచ్‌ఎండీ మండలాల్లో రూ.కోట్లు దాటే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం, పరిశ్రమలు విస్తరించి ఉన్నందున ప్రతి ఓటును అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రిజర్వుడు స్థానాల్లో సైతం లెక్కకు మించి ఖర్చు చేస్తున్నారు. ఉప సర్పంచ్ పదవులపై కన్నేసిన వార్డు సభ్యులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.
ఓటుకు రూ.5వేల వరకు పంపిణీ!
పోలింగ్‌కు సమయం కొద్ది గంటలే మిగిలి ఉండటంతో అభ్యర్థులు ఆఖరి అస్త్రాలను ఉపయోగిస్తు న్నారు. శుక్రవారం రాత్రి గుట్టచప్పుడు కాకుండా జోరుగా తాయిలాలు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇంటింటికీ మందు, చికెన్, నగదు అందజేశారు. ఓటుకు రూ.1000 నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం.
చివరి రోజు ప్రచారం హోరెత్తింది. అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. భువనగిరి,వలిగొండ, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి మండలాల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఆయన కూతురు కుంభం కీర్తిరెడ్డి ప్రచారం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని, తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఆలేరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే వలిగొండ మండలంలోని గ్రామాల్లో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య రోడ్ షోలతో పాటు ప్రధాన కూడళ్లలో మీటింగ్‌లు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. పల్లెలు పురోగతి సాధించాలంటే అధికార పార్టీల బలపరిచిన అభ్యర్థులకు ఓటేయాలని కోరారు.
భూదాన్‌పోచంపల్లి, వలిగొండ మండలాల్లోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.
రామన్నపేటలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రచారం చేశారు.
బీబీనగర్ మండలం రాఘవాపురంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి తమ పార్టీ అభ్యర్థి తరపున ఇంటింటి ప్రచారం చేసి, ర్యాలీలో పాల్గొన్నారు.
ఫ చివరి రోజు జోరుగా ర్యాలీలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం
ఫ ఈ దఫా మరిన్ని స్థానాలపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు
ఫ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు
ఫ ఓటర్లకు భారీగా తాయిలాలు
ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం


