నేటి సాయంత్రం నుంచి మద్యం షాపులు బంద్
భువనగిరి: రెండో విడత ఎన్నికలు జరిగే భువనగిరి, బీబీనగర్, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట మండలాల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా మండలాల పరిధిలో ఆదివారం పోలింగ్ ఉంటుందని, శనివారం సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. వైన్స్‌లతో పాటు కల్లు దుకాణాలు, బార్లను మూసివేయాలన్నారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా ప్రచారం ముగిసినందున సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. సినిమా, టెలివిజన్, సోషల్ మీడియా, ఇతర సామాజిక మా ద్యమాల ద్వారా ప్రచారం చేసినా నేరమన్నారు.
విధులకు హాజరుకాని వారిపై
క్రమశిక్షణ చర్యలు
ఎన్నికల విధులకు హాజరుకాని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. 14న జరిగే రెండో విడత ఎన్నికల్లో డ్యూటీ వేసిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. మొదటి విడత విధులకు హాజరుకాని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పాలనలో పల్లెలు అధ్వాన్నం
సాక్షి,యాదాద్రి : కాంగ్రెస్ పాలనలో పల్లెలు అధోగతి పట్టాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. పాలనలో, హామీల అమలులో విఫలం అయ్యారన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దితే, రేవంత్‌రెడ్డి అధఃపాతాళానికి దిగజార్చారని ఆరోపించారు. గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కనీస అవగాహన లేదన్నారు. కాంగ్రెస్ కళ్లు తెరిపించాలంటే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో సింగిల్ విండ్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నల్లమాస రమేష్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు బింగి జంగయ్య, కుతాడి సురేష్, పల్లపు విజయ్, దోసపాటి హరీష్, మోతె మనోహర్ ఉన్నారు.
సోలార్ విద్యుత్‌తో ప్రయోజనాలు
చౌటుప్పల్ : సోలార్ విద్యుత్‌తో అనేక ప్రయోజనాలుంటాయని కాలుష్య నియంత్రణ మండలి నల్లగొండ రీజినల్ అధికారి వెంకన్న తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెంలోని దివీస్ పరిశ్రమలో ఏర్పాటు చేసిన 680 కేవీ సోలార్ పవర్ ప్లాంట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చని, విద్యుత్ చార్జీల భారం నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు.పారిశ్రామికవేత్తలు తమ కంపెనీల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దివీస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.సురేష్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు బి.శ్రీనివాస్‌రావు, రాఘవేంద్ర, పరిశ్రమ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి క్షేత్రంలో శుక్రవారం ఆండాళ్ దేవికి ఊంజల్ సేవోత్సవం నేత్రపర్వంగా చేపట్టారు. అమ్మవారిని పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి ఊంజల్ సేవ జరిపించారు.
నేటి సాయంత్రం నుంచి మద్యం షాపులు బంద్
నేటి సాయంత్రం నుంచి మద్యం షాపులు బంద్


