సరస్వతీ పుత్రికలను ఆదుకోరూ..
కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన అందుగుల వెంకటయ్య, సైదమ్మ దంపతుల రెండో కుమార్తె తేజశ్రీ నీట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించి రామగుండం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. అయితే కళాశాలలో చేరడానికి ఫీజు కట్టలేక తల్లిదండ్రులతో కూలీ పనులకు వెళ్తోంది. తేజశ్రీ అక్క ప్రవళ్లిక కూడ మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం చదువుతోంది. చదువులో ముందంజలో ఉన్న తేజశ్రీ, ప్రవళ్లిక ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. వారి తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ చదివిస్తున్నారు. చదువు కొనసాగించేందుకు ప్రవళ్లికకు రూ.1,80,000, తేజశ్రీకి రూ.1,22,000 అవసరం ఉంది. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు.


