పాఠం.. పది కాలాలు గుర్తుండిపోయేలా..
తుంగతుర్తి : పాఠ్యాంశాలు పిల్లలకు అర్థమవడంతో పాటు పది కాలాలు గుర్తుండేలా బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాధ్యాయురాలు నివేదిత. మండలంలోని వెలుగుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో హిందీ టీచర్‌గా పనిచేస్తున్న కర్పూరపు నివేదిత ప్రత్యక్ష విధానంతో, వినూత్న పద్ధతుల్లో బోధిస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. పిల్లలు హిందీ అంటే అంతగా ఆసక్తి చూపక పోవడంతో వారిని ప్రోత్సహించడంతో పాటు పాఠాలు బాగా అర్థం చేసుకునేలా ప్రభుత్వం అందిస్తున్న ఏఐ పరికరాలను వినియోగించుకుంటూ విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులు హిందీని సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు ఆ సబ్‌జెక్ట్‌లో వెనుక బడిన వారికి ఉపయోగకరంగా ఉండేలా విద్యాబోధన చేస్తున్నారు.
పాఠాల్లోని పాత్రలన్నీ ప్రత్యక్షం
విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా ఉండేందుకు పాఠ్యాంశాల్లోని పాత్రలను విద్యార్థులతో వేయించి బోధన చేయడంతో పాటు తాను కూడా స్వయంగా వేషధారణ వేసి బోధిస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. 10వ తరగతి హిందీలో ఉన్న భక్త్ పథ్ పాఠాన్ని మీరాబాయి రచించింది. ఆ పాఠాన్ని బోధించేందుకు తానే స్వయంగా మీరాబాయి వేషధారణలో పాఠశాలకు వచ్చి మరీ బోధించడం ద్వారా విద్యార్థులలో ఆ పాఠ్యాంశంపై ఆసక్తిని పెంచారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ..
విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నారు. విద్యార్థులను కూడా పలు రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీతో పాటు వారిని ఆటల్లో ప్రోత్సహించడం, డాన్స్, సింగింగ్ వంటి వాటిలో శిక్షణ ఇవ్వడం చేస్తున్నారు. పేద విద్యార్థులకు సాయం అందిస్తూ వారిని చదువులో ప్రోత్సహిస్తున్నారు.
ప్రత్యక్ష పద్ధతిలో విద్యాబోధన
విజువల్, ఏఐ జోడించి
విద్యార్థులకు బోధన
ఆదర్శంగా నిలుస్తున్న
ఉపాధ్యాయురాలు నివేదిత
పాఠం.. పది కాలాలు గుర్తుండిపోయేలా..
పాఠం.. పది కాలాలు గుర్తుండిపోయేలా..


