అధిక వడ్డీ కేసులో మరికొందరి అరెస్ట్
నల్లగొండ: అధిక వడ్డీ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ బాలాజీనాయక్ అనుచరుడు మధును తో పాటు మరికొంత మంది ఏజెంట్లు పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం పలుగుతండా వద్దిపట్ల గ్రామానికి చెందిన రమావత్ మధునాయక్ ఓ ఫర్టిలైజర్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తూ జిల్లాలోని వివిధ మండలాల్లో మార్కెటింగ్ చేసేవాడు. ఆ క్రమంలో అతడికి చాలా మందితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తన సొంత గ్రామంలో వడ్డీ వ్యాపారం చేస్తున్న అన్న వరుస అయిన రమావత్ బాలాజీనాయక్ వద్ద ఏజెంట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత తన బావలు భరత్, బాబు, రమేష్‌తో కలిసి జీఎన్‌ఐ(గోకులానందన్ ఇన్‌ప్రా) అనే కంపెనీని మధునాయక్ ఏర్పాటు చేశాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర వెంచర్లున్నాయని, హైదరాబాద్‌లో పబ్బులు, స్పా సెంటర్లు, ఏపీలోని కర్నూలు వద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని డాక్యుమెంట్లు ప్రజలకు చూపారు. బాలాజీనాయక్ కంటే అధికంగా నెలకు రూ.15 నుంచి రూ.18 వడ్డీ ఇస్తామని అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి పెద్దఎత్తున డబ్బుల వసూలు చేయడం మొదలుపెట్టారు. అంతేగాక ఏజెంట్లను నియమించి డబ్బులు వసూలు చేసి తన బావల ఆదేశాల మేరకు ఆస్తులు కొనడం ప్రారంభించాడు. ఆ డబ్బుతో 2025 జనవరిలో హైదరాబాద్‌లో గోకులానందన్ ఇన్‌ప్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట రియల్ ఎస్టేట్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. ఫార్చునర్ కారు కొనడంతో పాటు సొంతూరిలో పెద్ద ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. దీంతో మధునాయక్‌కు పెద్దఎత్తున ప్రచారం వచ్చింది. దీంతో పలుగుతండా, చుట్టుపక్కల గిరిజన తండాలు, గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చిన వారికి రూ.10 వడ్డీ ఇస్తామని ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు. ఆ డబ్బులతో వ్యవసాయ భూములు, ఇళ్లు, ఖరీదైన కార్లు, బైక్‌లు కొని జల్సాలు చేయడం మొదలుపెట్టారు.
అసలు డబ్బులు ఇవ్వకపోవడంతో ఫిర్యాదు..
కొన్ని నెలల నుంచి అసలు, వడ్డీ డబ్బులు ఇవ్వకపోవడంతో మధునాయక్‌పై అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో అతడు తప్పించుకు పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అక్టోబర్ మొదటి వారంలో మధునాయక్, అతడి ఏజెంట్లపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఏఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందన్నారు. మధునాయక్ బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాలాజీనాయక్ కేసులో ఏజెంట్‌గా ఉన్న అతడి అన్న రవీందర్‌తో పాటు గణేష్, రాంప్రసాద్, సట్టు నరేష్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి థార్ వాహనం, ఎంజీ కారు, ఆల్టో కారు, విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న
ఎస్పీ శరత్‌చంద్ర పవార్
నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం
చేసుకున్న కార్లు
ఫ కార్లు, విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం
ఫ వివరాలు వెల్లడించిన
నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
అధిక వడ్డీ కేసులో మరికొందరి అరెస్ట్


