డ్రమ్‌ సీడర్‌ పద్ధతితో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

డ్రమ్‌ సీడర్‌ పద్ధతితో అధిక దిగుబడులు

Jul 14 2025 4:22 AM | Updated on Jul 14 2025 4:22 AM

డ్రమ్

డ్రమ్‌ సీడర్‌ పద్ధతితో అధిక దిగుబడులు

అధిక దిగుబడి

సాధారణ సాగు కన్నా డ్రమ్‌ సీడర్‌ పద్ధతిలో పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. సాళ్లలో కోనోవీడర్‌ ద్వారా కలుపు తీస్తే ఈ కలుపు మొక్కలు పంటకు పచ్చిరొట్ట ఎరువు అవుతుంది. పిలకలు, దుబ్బులు అధికంగా వస్తాయి. విత్తిన తర్వాత పంట కాలంలో రెండు నుంచి మూడుసార్లు కోనోవీడర్‌ తిప్పితే అధికంగా పంట దిగుబడి వస్తుంది.

త్రిపురారం: వానాకాలం సీజన్‌ ప్రారంభంకావడంతో బోర్లు, బావుల కింద నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే వరి నారు పెంపకం చేపట్టారు. కూలీలతో నాట్లు వేయించడానికి సిద్ధమవుతున్నారు. ప్రతి యేటా కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సమయం, పెట్టుబడి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కూలీల కొరతను అధిగమించడంతో పాటు పెట్టుబడి తగ్గించుకోవడానికి డ్రమ్‌ సీడర్‌ పద్ధతిలో వరి విత్తనాలు నేరుగా విత్తుకుంటే సమయం ఆదా అవ్వడంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతాయని కంపాసాగర్‌ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్‌ సూచిస్తున్నారు. డ్రమ్‌ సీడర్‌ పద్ధతిలో వరి విత్తనాలు విత్తుకునే పద్ధతిపై ఆయన సలహాలు, సూచనలు..

అనువైన నేలలు

సాధారణంగా వరి సాగు చేసుకునే అన్ని రకాల నేలల్లో డ్రమ్‌ సీడర్‌ పద్ధతి ద్వారా వరి విత్తనాలను విత్తి సాగు చేసుకోవచ్చు. ముంపునకు గురయ్యే భూములు, చౌడు, క్షారము, ఆమ్ల నేలలు అనుకూలం కాదు.

వరి విత్తన మోతాదు

వరి రకాన్ని బట్టి ఎకరానికి 10 నుంచి 15 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. వేరు వ్యవస్థ ధృడంగా ఉండి కాండం గట్టిగా ఏర్పడి అకాల వర్షాలు, ఈదురు గాలులకు పడిపోకుండా ఉండే అనువైన రకాలను శాస్త్రవేత్తల సూచనలతో ఎంచుకోవడం ఉత్తమమైన పద్ధతి. అవసరమైతే రైతులకు ఇష్టమైన ఏ వరి రకం విత్తనాలనైనా ఎంచుకోవచ్చు. ఈ పద్ధతిలో ఒక్క ఎకరం పొలం విత్తుకోవడానికి ఇద్దరు కూలీలు అవసరమవుతారు. డ్రమ్‌ సీడర్‌ లాగడానికి ఒక వ్యక్తి, గింజలు నింపడానికి ఒక వ్యక్తి అవసరమవుతారు. ట్రాక్టర్‌ ద్వారా ప్రత్యేకంగా తయారు చేసిన డ్రమ్‌ సీడర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

ప్రధాన పొలం తయారీ విధానం

సాధారణ పద్ధతిలో వరి నాటడానికి పొలాన్ని తయారు చేసుకున్నట్లుగానే డ్రమ్‌ సీడర్‌ పద్ధతికి కూడా పొలాన్ని తయారు చేసుకోవాలి. పొలంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి వీలుగా ఏర్పాటు చేసుకోవాలి. వీలైనంత చదునుగా చేసుకుంటే ఉత్తమం. చిన్న మడులుగా ఉంటే నీరు పెట్టడానికి విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. విత్తే సమయానికి నీరు లేకుండా బురదగా ఉంటే చాలు. ఇసుక శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో విత్తాలనుకున్న రోజే ఆఖరి దమ్ము చేసి మండె కట్టి విత్తనాలను విత్తుకోవాలి.

విత్తుకునే పద్ధతి

లీటరు నీటికి గ్రాము చొప్పున కార్భండిజమ్‌ కలిపిన ద్రావణంలో విత్తనాలు 12 గంటలు నానబెట్టి 24 గంటలు మండె కట్టాలి. కొద్దిగా కొమ్ము మలిగిన గింజలను డ్రమ్‌ సీడర్‌ ద్వారా విత్తుకోవచ్చు. నారు మడిలో నీటి యాజమాన్యం ఏవిధంగా చేస్తామో వరి మొదటి దశలో అదేవిధమైన పద్ధతిని అవలంబించాలి. డ్రమ్‌ సీడర్‌ పరికరానికి అవసరాన్ని బట్టి ప్లాస్టిక్‌ డ్రమ్ములు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి డ్రమ్ముకు 20 సె.మీ. దూరంలో రెండు చివర్ల వరకు రంధ్రాలు ఉంటాయి. ఈ డ్రమ్ముల్లో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి. మొలకెత్తిన గింజలు రాలడానికి వీలుగా ప్రతి డ్రమ్ములో మూడో వంతు మాత్రమే గింజులు నింపాలి. గింజలను నింపిన డ్రమ్ములను లాగితే 8 వరుసలలో వరుసకు వరుసకు మధ్య దూరం 20సెం.మీ., వరుసల్లో కుదురు కుదురుకు మధ్య దూరం 5 నుంచి 8సెం.మీ. ఉంటుంది. ఒక్కో కుదురులో 5 నుంచి 6 గింజలు రాలడం జరుగుతుంది. సన్నగింజ రకం విత్తనాలకు రంధ్రం వదిలి మరో రంధ్రం మూయాలి. ప్రతి 15 వరుసలకు అడుగు వెడల్పు కాలి బాటలు ఉంచాలి. తాడు ఉపయోగించి డ్రమ్‌ లాగితే వరుసలు బాగా వస్తాయి. కోనోవీడర్‌ తిప్పడానికి వీలుగా ఉంటుంది.

కలుపు నివారణ చర్యలు

విత్తిన మూడో రోజున పైరాజోసల్ఫూరాన్‌ ఇథైల్‌ 80 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా బెందియోకార్బ్‌ 1.25 లీటర్లు లేదా బుటాక్లోర్‌ + సేఫెసర్‌ 1.25 ఎకరానికి 20 కిలోల ఇసుకలో కలిపి విత్తిన 8 నుంచి 10 రోజులలోపు పొలంలో పల్చని నీరు ఉంచి చల్లుకోవాలి. దమ్ము చేసిన పొలంలో మండె కట్టిన విత్తనాన్ని పొలమంత సమంగా నీటి పొర నుంచి వెదజల్లాలి.

ఫ కంపాసాగర్‌ కేవీకే సేద్యపు విభాగం

శాస్త్రవేత్త చంద్రశేఖర్‌

డ్రమ్‌ సీడర్‌ పద్ధతితో అధిక దిగుబడులు1
1/1

డ్రమ్‌ సీడర్‌ పద్ధతితో అధిక దిగుబడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement