
ఒకదానికొకటి ఢీకొన్న ట్రావెల్స్ బస్సులు, కంటెయినర్
చౌటుప్పల్ రూరల్: హైవేపై ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుకనే వస్తున్న మరో రెండు బస్సులు, కంటెయినర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ సమీపంలో బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ పరిధిలోకి రాగానే విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక నుంచే వస్తున్న రమణ ట్రావెల్స్ బస్సు, ఆ వెనుకనే వస్తున్న కంటెయినర్, కంటెయినర్‌ను వెనుక నుంచి మరో ట్రావెల్స్ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. హైవేపై హైదరాబాద్ వైపు ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు.
రెండు బస్సులు పాక్షికంగా ధ్వంసం
క్షేమంగా బయటపడిన ప్రయాణికులు