కమిటీల ఎన్నికపై వీడని ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

కమిటీల ఎన్నికపై వీడని ఉత్కంఠ

May 22 2025 5:52 AM | Updated on May 22 2025 5:52 AM

కమిటీల ఎన్నికపై వీడని ఉత్కంఠ

కమిటీల ఎన్నికపై వీడని ఉత్కంఠ

ఆలేరు: కాంగ్రెస్‌ నూతన కమిటీల ఏర్పాటులో ఉత్కంఠ వీడటం లేదు. ఒక వైపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబు తున్నా.. మరోవైపు సదరు నేతలు పోటీకి సై అంటున్నారు. దాంతో కొత్త కమిటీల అధ్యక్షుల ఎంపిక జిల్లా నాయకత్వానికి కత్తిమీద సాములా మారింది. బుధవారం ఆలేరు పట్టణంలోని ఇందిరా కాంగ్రెస్‌ భవన్‌లో డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, పార్టీ పరిశీలకులు డాక్టర్‌ అనిల్‌ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణం, మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుల ఎంపికకు నేతల నుంచి దరఖాస్తుల స్వీకరణ సమావేశం జరి గింది. కానీ, పట్టణ, మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవుల కోసం పోటీ అధికంగా ఉండటంతో దరఖాస్తుల స్వీకరణపై స్పష్టత రాలేదు.

తీర్మానం ఇలా..

సమావేశం రసాభస కాకుండా కమిటీల ఎంపికలో ఎమ్మెల్యే నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని నేతలతో చేతులు ఎత్తి తీర్మానం చేశారు. ఈ సందర్భంలో సీనియర్‌ నాయకుడు నీలం వెంకటస్వామి మాట్లాడుతూ పదవి కోసం సదరు నేతలు పోటీలో ఉన్నట్టు మరి ఎమ్మెల్యేకు ఎలా తెలుస్తోందని ప్రస్తావించారు. జోక్యం చేసుకున్న డీసీసీ అధ్యక్షుడు బరిలో నిలిచే నేతలు నేరుగా ఎమ్మెల్యేను కలిసి తమ అభ్యర్థనలు చేసుకోవాలని సూచించారు. ఇదే విధంగా 2017 తరువాత పార్టీలో చేరిన నేతలు పార్టీ పదవికి పోటీ చేయడానికి అనర్హులని ఆయన స్పష్టం చేశారు. తాను 2017 తరువాతనే కాంగ్రెస్‌లో చేరినప్పటికీ సిన్సియర్‌గా సేవ చేస్తున్నాను.. తనకు పార్టీ పదవుల్లో అవకాశం కల్పించాలని నాయకుడు విజేందర్‌రెడ్డి అడుగగా..ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళతానని సంజీవరెడ్డి సమాధానం ఇచ్చారు. పీసీసీ సూచనలు, పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్యే తుది పరి శీలన తరువాత కమిటీ అధ్యక్షుల నియామకం ఉంటుందని చెప్పారు. సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా కమిటీల ఏర్పాటుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. పార్టీ నిబంధనలు ఉల్లంఽఘించే నేతలపై సీరియస్‌ చర్యలు ఉంటాయని డీసీసీ అధ్యక్షుడు హెచ్చరించారు. టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, నాయకులు శ్రీ నివాస్‌రెడ్డి, ఇజాజ్‌, ఎంఎస్‌ విజయ్‌కుమార్‌, సాగర్‌ రెడ్డి, వెంకటేశ్వరాజు, వెంకటస్వామి మండలాల నాయకులు, మాజీ ప్రజాపతినిధులు పాల్గొన్నారు.

పదుల సంఖ్యలో ఆశావహులు

పదవుల కోసం పదుల సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే వీరంతా ప్రభుత్వ విప్‌ అయిలయ్యను కలిశారు. కమిటీలను ఏకగ్రీవం చేయాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తుండగా, పోటీ తీవ్రంగా ఉండటంతో తలనొప్పిగా మారింది.

కాంగ్రెస్‌లో సంస్థాగత పదవుల కోసం తీవ్ర పోటీ

ఫ నాయకత్వానికి కత్తిమీద సాములా ఎంపిక

ఫ ఆలేరు పట్టణ, మండల, బ్లాక్‌ కమిటీలకు

దరఖాస్తుల స్వీకరణపై రాని స్పష్టత

అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటా: సంజీవరెడ్డి

డీసీసీ అధ్యక్షుడి నియామక అంశం అధిష్టానం చూసుకుంటుందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా తనను డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలా, వద్దా? అనేది అధి ష్టానం నిర్ణయిస్తుందన్నారు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్నారు. ఈనెలాఖరునాటికి జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల, బ్లాక్‌స్థాయి కాంగ్రెస్‌ నూతన కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు చెప్పారు. నేతలకు పార్టీ పదవులు లేదా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏదో ఒకటే అవకాశం ఉంటుందన్నారు. ఒకరికి రెండు పదవులు అసాధ్యమన్నారు. ఒకవేళ పార్టీ పదవిలో ఉండి, ఎన్నికల్లో పోటీకి నేతలకు అనివార్యమైతే పార్టీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement