
రైతులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
చిట్యాల: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. చిట్యాలలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చి ఇరవై రోజులు దాటినా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి కొర్రీలు పెడుతూ రైస్ మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అధికారులు బిజీగా ఉండి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోవటం ఆరోపించారు. రైతులు నుంచి కొనుగోలు చేసిన సన్నధాన్యానికి బోనస్ ఇవ్వకుండా, కాంగ్రెస్ నేతలు పక్క రాష్ట్రాల నుంచి సన్నధాన్యం తీసుకొచ్చి బోనస్ కోసం ఇక్కడి కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించటం లేదని, ఇచ్చిన హామీలను అమలు చేయటంలో అధికార పార్టీ విఫలమైందని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అవుల అయిలయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రుద్రారపు భిక్షం, మాజీ సర్పంచ్ సుంకరి యాదగిరిగౌడ్, మాజీ ఉప సర్పంచ్ బాతరాజు రవీందర్, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు కొలను వెంకటేష్‌గౌడ్, జిట్ట శేఖర్ పాల్గొన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య