
కనుల పండువగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన నాధస్వరం వినిపించారు.
సంప్రదాయ పూజలు
ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, ముఖ మండపంలో జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.