
రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి
పెన్‌పహాడ్: ప్రతి రైతు భూసారాన్ని తెలుకునేందుకు భూసార పరీక్షలు చేయించుకోవాలని గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం మృత్తిక శాస్త్రవేత్త ఎ. కిరణ్ అన్నారు. బుధవారం పెన్‌పహాడ్ మండలంలోని యల్లప్పకుంట తండాలో భూసార పరీక్షలకు మట్టి నమూనాలను సేకరించే విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు భూసారానికి అనుగుణంగా ఎరువులు వాడితే అధిక దిగుబడులు పొందవచ్చని తెలిపారు. భూసార పరీక్షలు చేయడం ద్వారా భూమిలోని చౌడు, సున్నం శాతాన్ని గుర్తించవచ్చని పేర్కొన్నారు. రైతులు తమ పొలాల్లోని మట్టిని సేకరించి గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రానికి పంపిస్తే భూసార పరీక్ష చేసి భూ ఆరోగ్య పత్రాలు అందజేస్తామని తెలిపారు. మట్టి నమూనాలు సేకరించే విధానానికి 7893989055 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కేవీకే యంగ్ ప్రొపెషనల్ జి. సంతోష్, సిబ్బంది బచ్చు వెంకటేశ్వర్లు, రైతులు బి. సైదా, జి. వెంకన్న, జి. సుధాకర్, భీమ్లా, పద్మ, సోమ్లా తదితరులు పాల్గొన్నారు.