భీమవరం (ప్రకాశంచౌక్): దివంగత ఐపీఎస్ అధి కారి ఉమేష్ చంద్ర విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత, అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి అని కలెక్టర్ సీహెచ్ నాగరాణి కొనియాడారు. ఆదివారం స్థానిక వీరమ్మ పార్కు సమీపంలోని ఉన్న ఎన్జీవో హోమ్ పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉమేష్ చంద్ర 60వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమేష్ చంద్ర చిత్రపటం వద్ద కలెక్టర్, అధికారులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు దిశగా ఉమేష్ చంద్ర చేపట్టిన ప్రయోగాత్మక కార్యక్రమాలు ఆదర్శప్రాయమన్నారు. అనంతరం హోమ్‌లో వృద్ధులను ఆమె ఆప్యాయంగా పలకరించి భోజన ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు అవసరమైన పలు వస్తువులు అందించారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డ్వామా పీడీ సీహెచ్ అప్పారావు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


