మార్చి 13 నుంచి జాతీయస్థాయి నాటికల పోటీలు
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు పట్టణంలో పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్చి 13, 14, 15 తేదీల్లో 17వ జాతీయ స్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు కళాపరిషత్ అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. పోటీల్లో మొత్తం 8 నాటికలు ప్రదర్శించబడతాయన్నారు. మార్చి 13వ తేదీ రాత్రి రవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి దేవుణ్ణి చూశా, ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి మంచి మనసులు, 14న సాంస్కృతిక సమితి విజయవాడ వారి మమ్మల్ని బతకనివ్వండి, చైతన్య కళాభారతి కరీంనగర్ వారి ఖరీదైన జైళ్లు, పరమాత్ముని ఆర్ట్స్ హైదరాబాద్ వారి ఎక్కడో ఏదో, 15న అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహాన, గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ, హర్ష క్రియేషన్స్ విజయవాడ వారి భువికోరని భ్రమణం (ప్రత్యేక ప్రదర్శన) నాటికలు ప్రదర్శింపబడతాయని తెలిపారు. కార్యదర్శి జక్కంపూడి కుమార్, గౌరవ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, వ్యవస్థాపక కార్యదర్శి మానాపురం సత్యనారాయణ నిర్వహణ ఏర్పాట్లను పరీశీలిస్తున్నారు.
తాడేపల్లిగూడెం : అమరావతిలో సోమవారం జరిగిన ఉద్యాన వర్సిటీ 68వ పాలకమండలి సమావేశంలో ఉద్యాన విశ్వవిద్యాలయం అధ్యాపకులకు, శాస్త్రవేత్తలకు పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు ఆమోదం తెలిపినట్లు ఉద్యానవర్సిటీ వీసీ కె.ధనుంజయరావు తెలిపారు. పాలకమండలి సమావేశ వివరాలను ఇక్కడ మీడియాకు విడుదల చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా విజన్ లక్ష్యాలను సాధించడానికి కార్యాచరణ రూపొందించినట్లు వీసీ తెలిపారు. రాయలసీమను ఉద్యాన హబ్‌గా గుర్తించే క్రమంలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామన్నారు. ఉద్యాన పంటల విస్తీర్ణం పెరిగేలా కృషి చేయాలని తీర్మానం చేశామన్నారు. ఉద్యాన పంటల వారీగా శాస్త్రవేత్తలను వర్గీకరించి, పంట యాజమాన్య పద్ధతులపై విస్తృత పరిశోధనలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. పెండింగ్‌లో మౌలిక వసతుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని తీర్మానాలు చేసినట్టు తెలియజేశారు.
బుట్టాయగూడెం: గిరిజన ప్రాంతాల్లో తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వైద్యం మూలికా వైద్యం విస్తరణకు తమ వంతు కృషి చేస్తున్నట్లు కేఆర్‌పురం ఐటీడీఏ ఏఎమ్‌ఓ కుంజా శిరమయ్య తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 16, 17 తేదీల్లో కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ వారి ఆధ్వర్యంలో గిరిజన వన మూలికపై హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి గత 20 ఏళ్లుగా విరిగిన ఎముకలకు మూలికా వైద్యం ద్వారా వైద్యసేవలు అందిస్తున్న మడకం దుర్గారావును, అలాగే ఫైల్స్ శాశ్వత నివారణ, ఇతర వ్యాధులకు మూలికలు ద్వారా వైద్యసేవలు అందిస్తున్న తూటిగుంటకు చెందిన చింతలాడ రామిరెడ్డిని, అలాగే సుమారు 300 రకాల వన మూలికలిను సేకరించి వాటి ద్వారా అనేక మందికి వైద్యసేవలు అందిస్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు పాయం కొయిందప్పను తీసుకువెళ్లినట్లు చెప్పారు. అక్కడ ఈ ముగ్గురు ఉత్తమమైన ప్రదర్శన ఇచ్చి పలువురి మన్ననలను పొందారని తెలిపారు. మూలికా వైద్యంలో పాల్గొన్న ముగ్గురు వైద్యులను సోమవారం డీడీ జనార్థన్‌రావు అభినందించారు.
భీమవరం: భీమవరం రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో సుమారు 45 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై ఎం సుబ్రహ్మణం తెలిపారు. రైల్వే స్టేషన్ మాస్టారు సమాచారం మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మృతుని వివరాలు తెలిసినవారు సెల్: 99084 48729 నంబర్‌కు తెలియజేయాలని ఎస్సై కోరారు.
ఏలూరు (టూటౌన్): కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని ఉప్పులూరు కోడిపందేల బరి వద్ద దళితులను అమానుషంగా హింసించిన నిర్వాహకులను అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా కోడి పందేలు నిర్వహించినవారిపైనా, వారిని అనుమతించిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు రక్షణ కల్పించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
మార్చి 13 నుంచి జాతీయస్థాయి నాటికల పోటీలు


