దాళ్వాకు జలగండం | - | Sakshi
Sakshi News home page

దాళ్వాకు జలగండం

Dec 19 2025 12:40 PM | Updated on Dec 19 2025 12:40 PM

దాళ్వ

దాళ్వాకు జలగండం

ఆరంభంలోనే నీటి ఎద్దడి సాగునీరు అందక ఆలస్యం

గోదావరిలో తగ్గిన నీటి లభ్యత

కాలువలు బాగుచేయకపోవడంతో దాళ్వా సాగుకు సరిగా నీరందడం లేదు. ప్రారంభంలోనే నీటి ఎద్దడి సమస్య ఎదురవుతోంది. మున్ముందు ఎండలు ముదిరేకొద్దీ మరింత ఇబ్బందిపడాలి. సాగు నీటికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలి.

– దేవరశెట్టి రాంబాబు, రైతు, బి.కొండేపాడు

తుపాను కారణంగా సార్వా పంట 25 బస్తాల మించి పండలేదు. రైతుకు కౌలు బకాయి పడ్డాం. సరిగా సాగునీరు అందక దాళ్వా పనులు ఆలస్యమవుతున్నాయి. యాటకలుపులు తీసే సమయం దగ్గర పడిన ఇంకా నారుమడులు పూర్తికాలేదు.

– కుప్పల శ్రీను, కౌలు రైతు, పెనుమంట్ర

సాక్షి, భీమవరం: జల వనరులశాఖ మంత్రి సొంత జిల్లాలో రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. దాళ్వా (రబీ) పనుల్లో రైతులు నిమగ్నమైన తరుణంలో నీరందక వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోంది. సాగు ప్రారంభంలోనే నీటి కష్టాలు రైతులను కలవరపరుస్తున్నాయి. జిల్లాలోని 95 శాతం విస్తీర్ణంలో తొలకరి కోతలు పూర్తయ్యాయి. ముందుగా మాసూళ్లు పూర్తయిన తాడేపల్లిగూడెంలో నాట్లు మొదలవ్వగా పెంటపాడు, అత్తిలి, పాలకోడేరు, ఇరగవరం, పెనుమంట్ర తదితర మండలాల్లో నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలోని బ్యాంకు కాలువ, నరసాపురం, అత్తిలి, జీఅండ్‌వీ, ఉండి, కాకరపర్రు తదితర కాలువల ద్వారా సాగు, తాగునీరు సరఫరా అవుతుంది. పలుచోట్ల నారుమడులు సిద్ధమవుతుండగా శివారు భూములకు సాగునీరు సరిగా అందక నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నారు. నారుమడులు తడారుతున్నాయంటున్నారు. అధిక శాతం విస్తీర్ణంలో సాగు పనులు మొదలవ్వక పొలాలు నెరలు తీస్తున్నాయి. పూర్తిస్థాయిలో నీరంది, దమ్ములు చేసి, నాట్లు వేసేందుకు మరో నెలన్నరకు పైనే సమయం పడుతుందంటున్నారు. సాగు ప్రారంభంలోనే సమస్య ఎదురవ్వడంతో మున్ముందు వంతుల వారీ విధానం మొదలై ఎండలు ముదిరేకొద్ది పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

తొలకరిలోనూ తిప్పలే..

తొలకరిలోను సాగునీటి ఎద్దడితో రైతులు ఇబ్బంది పడ్డారు. కాకరపర్రు రెగ్యులేటర్‌ గేట్లు వద్ద తూడు తొలగింపు, ఓఅండ్‌ఎం పనులు సకాలంలో పూర్తిచేయక జలవనరుల శాఖ మంత్రి సొంత నియోజకవర్గం పాలకొల్లులోని పోడూరు, యలమంచిలి మండలాలతో పాటు ఆచంట, నరసాపురం రూరల్‌లో నారుమడులు బీటలు తీయడంతో రైతులు నిరసనలు తెలిపిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

దాళ్వాపైనే ఆశలు

మోంథా, దిత్వా తుపాన్లతో రైతులకు ఖరీఫ్‌ కలిసి రాలేదు. సాగు చివరిలో ప్రతికూల వాతావరణం దెబ్బతీసింది. ఎకరాకు 35 బస్తాల సగటు దిగుబడికి గాను 28 బస్తాలే వచ్చాయి. పంట పెట్టుబడులు దక్కకపోగా తీవ్రంగా నష్టపోయి దాళ్వా పైనే ఆశలు పెట్టుకున్నారు. దాళ్వాలో నీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందుగానే చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైన ఇంజన్లు ఏర్పాటుచేయడం, లష్కర్లు అందుబాటులో ఉండేలా చూడటం, డ్రెయిన్లపై అడ్డుకట్టలు వేసే ప నులు వేగవంతం చేసే దిశగా నీటి సంఘాలు కృషిచేయాలంటున్నారు. ఎద్దడి రాకుండా సీలేరు ద్వారా అవసరమైన నీటిని సేకరించి చివరి ఆయకట్టు వరకు అందించాలంటున్నారు.

ఆదిలోనే హంసపాదు

జిల్లాలోనే జలవనరులశాఖ మంత్రి

అయినా సాగునీటికి తిప్పలు

2.23 లక్షల ఎకరాల్లో రబీ సాగుకు రైతులు సన్నద్ధం

నీటి ఎద్దడితో పనులకు ఆటంకం

తొలకరిలో నారుమడులు ఎండిన పరిస్థితి

సాగు, తాగునీటి అవసరాలకు 34.22 టీఎంసీలు అవసరం

జిల్లాలో రబీ సాగుకు 30 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 4.22 టీఎంసీలు నీరు అవసరమని అంచనా. గోదావరిలో నీటి లభ్యత తక్కువ ఉన్నా సీలేరు పవర్‌ డ్రాప్ట్‌ నుంచి వచ్చే జలాలు, పోలవరం నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంది. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు గేట్లను బిగించే పనులు పూర్తిచేయడంతో రబీకి నీటిని వాడుకునే వెసులుబాటు కలిగింది. అప్పట్లో నీటి నిర్వహణ, పొదుపు చర్యలతో అవసరాన్ని బట్టి క్రాస్‌బండ్‌లు, ఆయిల్‌ ఇంజన్లు ఏర్పాటుచేయడం తదితర చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం అండగా నిలిచేది. ప్రస్తుతం గోదావరిలో నీటి లభ్యత తగ్గుతోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు రబీసాగు, తాగునీటి కోసం 93.26 టీఎంసీలకు పైనే అవసరం కాగా ప్రస్తుతం బ్యారేజీ వద్ద 73.36 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంది.

దాళ్వాకు జలగండం 1
1/3

దాళ్వాకు జలగండం

దాళ్వాకు జలగండం 2
2/3

దాళ్వాకు జలగండం

దాళ్వాకు జలగండం 3
3/3

దాళ్వాకు జలగండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement