ప్రభుత్వంపై గళమెత్తిన ఉపాధ్యాయులు
ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ 2010 ముందు నియామకం పొందిన టీచర్లకు టెట్ రద్దు చేయాలని, ఈ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారాలు, సెలవు రోజుల్లో తరగతులు రద్దు చేయాలన్నారు. సింగిల్ టీచర్లు ఓహెచ్‌లు ఉపయోగించుకునే విషయంలో ఇబ్బందులు తొలగించాలన్నారు. గురుకుల సంక్షేమ పాఠశాలల్లో గురువులపై అధికారులు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలన్నారు. మహిళా ఉపాధ్యాయులపై ఎంఈఓలు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని కోరారు. అనంతరం డీఆర్వో, డీఈఓలకు ప్రా తినిధ్యాలు ఇచ్చారు. జిల్లా అధ్యక్షులు బొర్రా సు భాషిణి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, గౌరవాధ్యక్షుడు శ్యాంబాబు, సహాధ్యక్షురాలు ఎస్.సుధారాణి, కోశాధికారి జీవీ రంగమోహన్, రాష్ట్ర కౌన్సిలర్ షేక్ ముస్తఫా అలీ, జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.


