మెట్టలో అంతరిస్తున్న జీడి తోటలు
మార్కెట్ సౌకర్యం కల్పించాలి
గిట్టుబాటు లేక తోటను తొలగించాను
● సాగుకు రైతన్న నిరాసక్తత
● ఇప్పటికే వేలాది ఎకరాలు కనుమరుగు
చింతలపూడి: ఒకప్పుడు మెట్ట ప్రాంతంలో వేల ఎకరాల్లో సాగయ్యే జీడి మామిడి తోటలు క్రమ,క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఆశించినస్థాయిలో పంట చేతికి రాక, వచ్చినా సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కూడా అంతంత మాత్రమే. ఈ ప్రాంతంలో పంట సాగుకు అనువైన వాతావరణం ఉన్నప్పటికీ రైతులకు సూచలను అందించే వారు కరువవ్వడంతో ఏటేటా విస్తీర్ణం తగ్గుముఖం పడుతుంది. ఏటా మెట్ట రైతులకు కోట్లాది రూపాయల రాబడిని ఆర్జించి పెట్టిన జీడి మామిడి తోటలు ప్రస్తుతం అంతరించిపోతున్నాయి. ఓ ఏడాది లాభం, రెండేళ్ల నష్టం వస్తుండడంతో పదేళ్లుగా జీడి తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు.
పెరిగిన భూగర్భ జలాల వినియోగం
మెట్ట ప్రాంతంలో ఇటీవల ముఖ్యంగా పామాయిల్, మొక్కజొన్న, వేరుశెనగ, అరటి పంటలను ఎక్కువగా పండిస్తున్నారు. అదీకాక మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాల వినియోగం పెరిగాక వాణిజ్య పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. చింతలపూడి సబ్ డివిజన్‌లో ఒకప్పుడు వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న జీడి తోటలు ప్రస్తుతం 2,000 హెక్టార్లకు చేరుకున్నాయి. గత కొన్నేళ్లు గా జీడి పిక్కల బస్తా రూ. 8 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుంది. ఈ ఏడాది ఇంత వరకు ధర అధికారికంగా వెల్లడి చేయలేదు. జీడి తోటల పెంపకం వల్ల రైతులకు రక,రకాలుగా ఆదాయం లభిస్తుంది. మన ప్రాంతంలో రైతులు జీడి పిక్కలను మాత్రమే సేకరిస్తారు. జీడి పండ్లను చెట్ల కిందే వదిలేస్తారు. అదే ఇతర రాష్ట్రాల్లో అయితే అక్కడి రైతులు పండ్లను కూడ సేకరించి ఆదాయం పొందుతున్నారు. వీటితో జామ్, పండ్ల రసాలు, తయారు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏటా ఇక్కడి నుంచి కమీషన్ దారులు లారీల్లో జీడి పిక్కలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. మొత్తం మీద మెట్లలో ఓ వెలుగు వెలిగిన జీడి తోటలు ప్రస్తుతం కనుమరుగైపోతున్నాయి.
ప్రభుత్వం జీడితోటల పెంపకం చేపట్టే రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలి. ముఖ్యంగా రైతులు పండించిన జీడి పిక్కలను ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. జీడి పరిశ్రమ అభివృద్ధి కోసం అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి.
– యర్రంశశెట్టి రామకృష్ణారావు, రైతు, నామవరం
నాకు గ్రామంలో 4 ఎకరాల జీడిమామిడి తోట ఉండేది. జీడి పంటకు సరైన ప్రోత్సహం లేకపోవడం, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సస్యరక్షణ చర్యలు చేపట్టి సాగు చేస్తే పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఉండటం లేదు. దీంతో జీడి తోటను తొలగించి పామాయిల్ తోట నాటాను.
– మాగసాని గురుబ్రహ్మం, జీడి మామిడి రైతు, కనిపెడ
మెట్టలో అంతరిస్తున్న జీడి తోటలు
మెట్టలో అంతరిస్తున్న జీడి తోటలు
మెట్టలో అంతరిస్తున్న జీడి తోటలు


