వరి పొలాలకు నిప్పు ముప్పు
● అవగాహన లోపంతో నిప్పు పెడుతున్న రైతులు
● పట్టించుకోని అధికారులు
పెనుమంట్ర : జిల్లాలోని వరి పొలాలకు నిప్పు ముప్పు ఏర్పడింది. కూలీల కొరత అధిగమించడానికి, సాగులో ఖర్చులను తగ్గించుకోవడానికి రైతులు కోత యంత్రాలతో వరి కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని మాసూళ్లు చేస్తున్నారు. అయితే కొందరు రైతులు కోతలు పూర్తయిన అనంతరం అవగాహన లోపంతో ఆ గడ్డిని పంట పొలాల్లో ఉంచి నిప్పు పెడుతున్నారు. గతంలో ఒకరిద్దరు ఇలాంటి పద్ధతులను అనుసరిస్తే వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచనల మేరకు రైతులకు అవసరం లేని గడ్డిని చేలోనే ట్రాక్టర్ తో మురగ దమ్ము చేసి దాళ్వా నాట్లు వేసేవారు. అయితే ఈ ఏడాది కోతల ముందు తుఫాన్ కారణంతో సాగునీటి సరఫరాను నెల రోజులుగా నిలిపేశారు. దీంతో పూర్తిస్థాయిలో ఇంకా సాగినీటి సరఫరా జరగపోవడంతో కొందరు రైతులు అవగాహన లోపంతో పంట పొలాల్లో నిప్పు పెట్టి గడ్డిని ధ్వంసం చేస్తున్నారు.
భూసారానికి దెబ్బ
పంట చేలో గడ్డికి నిప్పు పెడితే నేలలో భూసారం దెబ్బతినడమే కాకుండా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు ఒకరిని చూసి ఇంకోకరు అన్నట్లు విచ్చలవిడిగా పంటపొలాల్లో గడ్డిని తగలబెడుతున్నారు. నాలుగు రోజులుగా పెనుమంట్ర మండలంలో అనేక మంది రైతులు మంట పెట్టడంతో పంట పొలాలు మసిబారిపోయాయి. శుక్రవారం సాయంత్రం కూడా చాలా మంది రైతులు పంట పొలాలకు నిప్పు పెట్టి గడ్డిని ధ్వంసం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైతుల్లో అవగాహన కల్పించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
వరి పొలాలకు నిప్పు ముప్పు


