పేదల వైద్యాన్ని ప్రైవేటీకరిస్తే సహించం
తణుకు అర్బన్: పేద వర్గాలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య అందించాలనే సదుద్దేశంతో మాజీ ము ఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తామంటే సహించేది లేదని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తణుకు రాష్ట్రపతి రోడ్డులోని కోర్టు సమీపంలో గురువారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ శిబిరంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏ ముఖ్యమంత్రీ తీసుకురాలేదని, జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే 17 మెడికల్ వైద్య కళాశాలలను తీసుకువచ్చి చరిత్ర సృష్టించారని తెలిపారు. అటువంటి మెడికల్ కళాశాలలను నిర్వహించలేక చంద్రబాబు సర్కారు చేతులెత్తేయడమే కాకుండా ప్రైవేటీకరణకు చూస్తోందని మండిపడ్డారు. ఏదేమైనా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడపాలనే తమ నినాదంతో ఎంతవరకు అయినా వెళ్తామని ఆయన తేల్చిచెప్పారు.
వెల్లువలా కోటి సంతకాల సేకరణ
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణకు ప్రజాదరణ అధికంగా ఉందని మాజీ మంత్రి కారుమూరి అన్నారు. ఎక్కడ శిబిరం పెట్టినా ప్రజలు వెల్లువలా వచ్చి సంతకాలు చేస్తున్నారని తెలిపారు. ప్రైవేటీకరణ అంశం ప్రజల్లోకి తీవ్రంగా వెళ్లిందని, ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఛీకొడుతున్నారని చెప్పా రు. శిబిరానికి న్యాయవాదులు పెద్ద ఎత్తున వచ్చి సంఘీభావం తెలపడటం అభినందనీయమన్నారు. పార్టీ నేతలు మారిశెట్టి శేషగిరి, వడ్లూరి సీతారాం, జల్లూరి జగదీష్, సీనియర్ న్యాయవాది బలిజేపల్లి రవిశంకర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చోడే గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరిక
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో ఇరగవరం మండలం రేలంగి, తూర్పువిప్పర్రు గ్రామాల నుంచి యువకులు వైఎస్సార్ సీపీ లో చేరారు. పార్టీ నాయకులు షేక్ షబ్బీర్ ఆధ్వర్యంలో రేలంగికి చెందిన సీహెచ్ విజయ్, పి.అరవింద్, కె.సందీప్, తూర్పువిప్పర్రు గ్రామానికి చెందిన ఎస్.శంకర్ సంతకాల సేకరణ శిబిరానికి హాజరుకాగా వారికి కారుమూరి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కారుమూరి సూచించారు.
మాజీ మంత్రి కారుమూరి
పేదల వైద్యాన్ని ప్రైవేటీకరిస్తే సహించం


