వైద్య కళాశాలలను పరరిరక్షించుకోవాలి
మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు
పెనుగొండ: పేద విద్యార్థులకు వైద్య విద్యనందనివ్వకుండా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకించి, కాలేజీలను పరిరక్షించుకోవాలని వైఎస్సార్ సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యు డు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు గురువారం పెనుగొండ గాంధీబొ మ్మల సెంటర్‌లో కోటి సంతకాల సేకరణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు నిర్ణయాలతో మొదటి సంవత్సరంలోనే రెండు వేలకు పైగా మెడికల్ సీట్లను పేద విద్యారులు కోల్పోయారన్నారు. వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 17 వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకువచ్చిందని వివరించారు. వీటిలో ఏడు కళాశాలలకు నిర్మాణం పూర్తి చేయగా, కొన్ని కళాశాలల్లో తరగతులు సైతం ప్రారంభించారన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మెడికల్ సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతేగాకుండా, వైద్య విద్యను పూర్తిగా పేదలకు దూరం చేయడానికి చంద్రబాబు కుట్రపన్ని ప్రైవేటీకరణకు శ్రీకారం చుడుతున్నారన్నారు. ప్రతిఒక్కరూ ప్రైవేటీకరణను వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన పోరాటానికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. వైస్ ఎంపీపీ తోలేటి శ్రీను, పార్టీ ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, మండల కన్వీనరు నల్లిమిల్లి వేణుప్రతాపరెడ్డి (బాబీ),పట్టణ అధ్యక్షుడు ఆసు నగరి, పార్టీ నాయకులు కర్రి వేణుబాబు, ఆసు నగరి, కొనుకు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


