అక్రమ రిజిస్ట్రేషన్లపై పోరాటం
ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి బాధితులు
ఉండి: తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని అక్రమ రిజిస్ట్రేషన్ బాధితులు అన్నారు. ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా ఇద్దరు, ముగ్గురుగా ఉన్న బాధితులకు శుక్రవారం మరొ కరు తోడయ్యారు. గణపవరంలో లేఖరుగా పనిచేస్తున్న తన ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆయన నిరసన తెలిపారు. సోమ వారం పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తానన్నారు. తన ఆరోగ్యం క్షీణిస్తుందని, అయినా వేధింపులు తగ్గడం లేదని, అవినీతిపరులకు కొమ్ముకాస్తున్న అధికారులు ఉన్నంతకాలం పరిస్థితి ఇలానే ఉంటుందని మరో బాధితుడు రాజ్‌కుమార్ అన్నారు. అలాగే తమకు చెందిన ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు సిద్ధం చేసి డాక్యుమెంట్‌లో పెట్టారని ఏదోక సమయంలో రిజిస్ట్రేషన్ చేస్తారంటూ మరో బాధితుడు ఏలూరి రంగబాబు ఆరోపిస్తున్నారు.
కొనసాగుతున్న తనిఖీలు
ముగ్గురు ప్రత్యేకాధికారుల బృందం రెండో రోజు శుక్రవారం కూడా ఉండి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. అత్తిలి సబ్ రిజిస్ట్రార్ వీవీవీ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్లు కిరణ్‌కుమార్, ఎస్‌కే ఆలీ తనిఖీల్లో పాల్గొన్నారు. గతేడాది కాలంగా ఇక్కడ జరిగిన రిజిస్ట్రేషన్లు, వాటిలో ఎనీవేర్ ఆప్షన్ ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లు, వాటిలో ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ఆన్‌లైన్‌లో తెలిపిన అభ్యంతరాలు తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీలు పక్కాగా జరిగితే వందల సంఖ్యలో అక్రమ రిజిస్ట్రేషన్లు బయటకు వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.


