జగన్‌ను విమర్శించే అర్హత నిమ్మలకు లేదు
పాలకొల్లు సెంట్రల్: వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుని విమర్శించలేని మీకు రైతు సంక్షేమం కోసం పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఉందా అని వైఎస్సార్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) మంత్రి నిమ్మల రామానాయుడును ప్రశ్నించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రైతులను పరామర్శించడంపై జగన్ ను విమర్శించే ముందు చంద్రబాబు మాటలను గుర్తుచేసుకుంటే విషయం బోధపడుతుందన్నారు. యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని రైతులకు చెప్పింది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేశారని, రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి రూ.13,500 చొప్పున ఇచ్చారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో నిత్యం రైతు శ్రేయస్సు కోసం పాటుపడితే.. ఇటీవల వచ్చిన మోంథా తుపాను సమయంలో రైతులను పరామర్శించకుండా లండన్‌లో కూర్చున్న సీ ఎం చంద్రబాబును ప్రశ్నించే దమ్ము మీకుందా అని సవాల్ విసిరారు. కనీసం మీరు మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇప్పటివరకూ తుపాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో బీమా, ఇన్‌పుట్ సబ్సిడీల విషయంలో రైతులు నష్టపోయారన్నారు. మంత్రి నిమ్మల ఇష్టానుసారం మాట్లాడితే వైఎస్సార్‌సీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోబోరన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ టెస్టింగ్ భవనాల పేర్లపై స్టిక్కర్లు అంటించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన రో డ్లకు శిలాఫలకాలు వేసుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. నియోజకవర్గంలో తుపాను ప్రభావంతో ఎందరో నష్టపోతే కేవలం రెండు వర్గాలవారికే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలా మంత్రి నిమ్మల వివక్ష చూపడం తగదన్నారు. పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, యినకొండ రవి, ఉచ్చు ల స్టాలిన్, ఖండవల్లి వాసు, పాలపర్తి కృపానాథ్, చెన్ను విజయ్ పాల్గొన్నారు.
నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి


