క్షీరారామంలో జ్వాలాతోరణం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లులోని క్షీరారామరామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని కృత్తికా నక్షత్రం రోజున జ్వాలా తోరణం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి బుధవారం రాగా కృత్తికా నక్షత్రం గు రువారం వచ్చింది. ఈ సందర్భంగా రాత్రి 8 గంటల సమయంలో ఆలయ గర్భగుడికి వెనుక భాగంలో ఉన్న కార్తికేయునికి ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో స్వామివారి సన్నిధిలో జ్వాలా దీపం వెలిగించి ఆలయ ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ముఖద్వారం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ జ్వాలా దీపంతో జ్వాలా తోరణం వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రధానార్చకులు కిష్టప్ప, అనిల్, వీరబాబు పూజాదికాలు నిర్వహించారు. ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు, ట్రస్ట్ సభ్యులు పర్యవేక్షించారు.


