తణుకు అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా బాలురు, బాలికల సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్‌లలో 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమరెడ్డి శ్రీకాంత్ తెలిపారు. బుధవారం తణుకు కేకేఆర్ స్కూలు క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఎంపికల్లో జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరుకాగా మొత్తం 24 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరంతా ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు కర్నూలులో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొంటారని వివరించారు. ఎంపిక పోటీలను ముఖ్య అతిథి బసవ రామకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జి.వెంకటరావు, కె.కృష్ణ, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు పి.శ్రీను, జి.శ్రీకాంత్ అభిలాష్, సన్నీ సాగర పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): విభిన్న ప్రతిభావంతులకు (శారీరక వైకల్యముగలవారు) మూడు చక్రాల మోటార్ వాహనాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ, జిల్లా మేనేజర్ బి.రామ్‌కుమార్ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని సదరు దరఖాస్తును అన్ని ధ్రువపత్రాలతో ఈనెల 25వ తేదీలోగా కార్యాలయంలో సమర్పించాలని, అర్హులను జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.
నరసాపురం రూరల్: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం పేరుపాలెం, కేపీపాలెం బీచ్‌లలో బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు మైరెన్ సీఐ ఎ.నవీన్ నరసింహ మూర్తి తెలిపారు. గత కొన్ని రోజులుగా తుపాను ప్రభావంతో బీచ్‌కు పర్యాటకుల సందర్శనను నిలిపి వేశారు. తుపాను ప్రభావం తగ్గడం, కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పర్యాటకులు అధిక సంఖ్యలో బీచ్‌లను సందర్శించనున్న నేపథ్యంలో డీఐజీ, అదనపు ఎస్పీల ఆదేశాల మేరకు అంతర్వేది మైరెన్ , మొగల్తూరు పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు, పర్యాటకులు నిర్ధేశిత ప్రాంతాల్లోనే స్నానం చేయాలని, సెల్ఫీలు, వీడియోల కోసం లోపలికి వెళ్లవద్దని కోరారు. గజ ఈతగాళ్లు, పోలీసులు పహారా కాస్తున్నట్లు వెల్లడించారు. మైరెన్ ఎస్సై సోమశేఖర్ రెడ్డి, మొగల్తూరు ఎస్సై జి.వాసు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
దెందులూరు: కోళ్ల వ్యర్థాలు తరలివస్తున్న వ్యాన్‌ను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. బుధవారం జాతీయ రహదారి సత్యనారాయణపురం సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాదు నుంచి నిడమర్రుకు తరలిస్తున్న కోళ్ల వ్యర్థాల వ్యాన్‌ను పట్టుకుని సీజ్ చేసినట్లు దెందులూరు ఎస్ ఆర్.శివాజీ తెలిపారు. పెదపాడు గ్రామానికి చెందిన డ్రైవర్‌తో పాటు అందే ఖాన్ చెరువు గ్రామానికి చెందిన వాహన యజమాని వినయ్‌రావు, నిడమర్రు చేపల చెరువు యజమాని విజయకృష్ణలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు 24 మంది ఎంపిక


