చెడు వ్యసనాలు, విలాసాలతో నేరాలు
● చోరీ కేసుల్లో ఐదుగురి అరెస్ట్
● రూ.10.20 లక్షల చోరీ సొత్తు రికవరీ
ఏలూరు టౌన్ : చెడు వ్యసనాలు, విలాసాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్, మోటార్‌సైకిళ్లు దొంగతనాలు చేస్తున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.10.20 లక్షల చోరీ సొత్తు రికవరీ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో చోరీలపై ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో నిడమర్రు సీఐ ఎన్.రజనీకుమార్ ఆధ్వర్యంలో చేట్రోలు ఎస్సై ఎం.సూర్యభగవాన్, నిడమర్రు ఎస్సై ఎస్‌ఎన్‌వీవీ రమేష్, గణపవరం ఎస్సై ఏ.మణికుమార్, భీమడోలు ఎస్సై ఎస్‌కే మదీనాబాషా దర్యాప్తు చేపట్టారు. చైన్‌స్నాచింగ్, మోటారు సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను బుధవారం మధ్యాహ్నం ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామశివారు మురుక్కోడు వంతెన, పత్తేపురం వైపు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.70 లక్షల విలువైన నాలుగు మోటారు సైకిళ్లు, స్నాచింగ్ కేసుల్లో అపహరించిన రూ.6.50 లక్షల విలువైన బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆకివీడు ఎస్‌బీఐ బ్యాంకు నుంచి 38.8 గ్రాముల బంగారు నగలు రికవరీ చేయాల్సి ఉంది.
నిందితులపై పలు కేసులు
నిందితులు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం కోళ్ళపర్రు గ్రామానికి చెందిన తాటిపర్తి రాముడు, నక్క వెంకటేష్, తాటిపర్తి దుర్గారావు, ఉండి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన గండికోట నాగరాజు, అత్తిలి మండలం ఎర్రనేలగుంట గ్రామానికి చెందిన ఆసెట్టి నాగేష్‌లపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. రాముడుపై 11, దుర్గారావుపై 19, నాగరాజుపై 3, నాగేష్‌పై 14 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నేరగాళ్లను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ ఉన్నారు.


