ఆకట్టుకున్న సైన్స్ డ్రామా పోటీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక ఈదర సుబ్బమ్మాదేవి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన జిల్లా సైన్స్ డ్రామా పోటీలు విద్యార్థులకు విజ్ఞానం పంచడంతో పాటు సందేశాత్మకంగా సాగి ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం ఆధ్వర్యంలో దక్షిణ భారత స్థాయిలో నిర్వహించనున్న పోటీల్లో భాగంగా తొలుత జిల్లా స్థాయిలో ఈ పోటీలను నగరంలో నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లాలోని 6 మండలాల నుంచి 11 టీంలకు చెందిన 62 ప్రభుత్వ పాఠశాలల విద్యారినీ విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుటుంబరావు కార్యక్రమాన్ని ప్రారంభించి, సైన్స్ అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ పోటీల్లో నూజివీడు డివిజన్ పల్లెర్లమూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం కై వశం చేసుకోగా ఏలూరు ఎస్‌ఈఎస్‌డీఎం సీహెచ్ స్కూల్ విద్యార్థులకు ద్వితీయ స్థానం లభించింది. ఈ పోటీల్లో ప్రథమ స్థానం పొందిన జట్టు ఈనెల 7న గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ సోమయాజులు, స్థానిక పాఠశాల బయాలజీ టీచర్ పద్మాసుకుమారి, గైడ్ టీచర్లు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు.


