ఎన్‌హెచ్–165పై అడుగడుగునా మడుగులే
● పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు ● డ్రెయిన్‌లు తవ్వించినా పరిష్కారం శూన్యం
ఆకివీడు: జాతీయ రహదారి నెం.165 ఆధునికీకరణ దేవుడెరుగు.. ప్రస్తుతం ఉన్న రోడ్డు అడుగడుగునా గుంతలతో భయపెడుతుంది. వాహన చోదకులు, ప్రయాణికులు, పాదచారుల అవస్థలు వర్ణణాతీతం. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షపు నీరు, మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తూ.. తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. రోడ్డుపై వెళ్లే వారు వ్యాధులకు గురవుతామనే ఆందోళనలో ఉన్నారు. ఇటీవల కచ్చా డ్రెయిన్ తవ్వినప్పటికీ వర్షపు, మురుగు నీరు ప్రవహించడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఎన్‌హెచ్ నెం.165 అభివృద్ధికి ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రూ.2200 కోట్లు కేటాయించినా, పనులు మాత్రం అంగుళం ముందుకు కదలడం లేదు. ఏళ్ల తరబడి జాతీయరహదారి అభివృద్ధి అంటూ పాలకులు, ఆ శాఖ అధికారులు ప్రజల్ని ఊరిస్తున్నారు. పామర్రు నుంచి పాలకొల్లు వరకూ ఉన్న రోడ్డును జాతీయ రహదారుల శాఖ విలీనం చేసుకుని రెండు పుష్కర కాలాలు గడిచినా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. డ్రైనేజ్ సౌకర్యం కల్పించకుండా, రోడ్డు ఇరువైపులా ఉంటున్న వారినే డ్రైయినేజీ నిర్మించుకోమనడం దారుణమని పలువురు వాపోతున్నారు. ఉప్పుటేరు నుంచి జాతీయ రహదారిని అభివృద్ధిచేయాలని, రోడ్డును పునర్నిర్మించాలని, ఆక్రమణల్ని తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. రహదారికి ఇరువైపులా పక్కా డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జాతీయ రహదారి అభివృద్ధి పట్ల తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. పలు చోట్ల రోడ్డు అధ్వానంగా ఉంది. ప్రమాదాలు జరిగినా ఆ శాఖ అధికారులు కనీస మరమ్మతులు చేపట్టడంలేదు. ఆకివీడు–చెరుకువాడ మధ్య రహదారి కుంగిపోయి దారుణంగా ఉంది. మరికొన్ని చోట్ల రోడ్లపైనే వర్షపు నీరు నిలబడి ఇబ్బందికరంగా మారింది.
– అంబటి రమేష్, ఆకివీడు
జాతీయరహదారిపై వెళ్లాలంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారి పలు చోట్ల ముంపుకు గురైంది. సైకిల్‌పై, నడిచి వెళ్లే హైస్కూల్ విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ప్రాంతంలో వర్షపు నీరు, మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్‌హెచ్ అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలి.
– అద్దంకి ప్రసాద్, అధ్యాపకులు, ఆకివీడు
ఎన్‌హెచ్–165పై అడుగడుగునా మడుగులే
ఎన్‌హెచ్–165పై అడుగడుగునా మడుగులే
ఎన్‌హెచ్–165పై అడుగడుగునా మడుగులే
ఎన్‌హెచ్–165పై అడుగడుగునా మడుగులే
ఎన్‌హెచ్–165పై అడుగడుగునా మడుగులే


