మాతా శిశు మరణాలపై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి ఆధ్వర్యంలో మాతృ మరణాలు, శిశు మరణాలు సబ్ కమిటీ అంతర్గత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ త్రెమాసికంలో శిశు మరణాలు, కారణాలపై సంబంధిత వైద్యాధికారులు, పర్యవేక్షకులు ఏఏన్‌ఏం ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలతో సమగ్ర విశ్లేషణ నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ దేవ సుధా లక్మీ, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ సూర్యనారాయణ, గర్భకోశ వ్యాధుల నిపుణులు డా.మాధవి కళ్యాణి, చిన్న పిల్లలు వ్యాధి నిపుణులు డా.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: జిల్లా వ్యాప్తంగా శనివారం 507 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాలకొల్లులో 69.6 మిల్లీమీటర్లు నమోదుకాగా భీమవరంలో 26, నరసాపురంలో 16.6, తాడేపల్లిగూడెంలో 8, తణుకులో 7.6, ఆకివీడులో 30.2, పెంటపాడులో 14, అత్తిలిలో 22.6, గణపవరంలో 29.6, ఉండిలో 30.4, పాలకోడేరులో 19.2, పెనుమంట్రలో 23.8, ఇరగవరంలో 18.8, పెనుగొండలో 14.4, ఆచంటలో28, పోడూరులో 22.2, వీరవాసరంలో 34.2, కాళ్లలో 22.2, మొగల్తూరులో 22.2, యలమంచిలిలో 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ద్వారకాతిరుమల: శ్రీవారి గోదానం, గో దత్తత పథకాలను వచ్చే నెల 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. లంపి స్కిన్ వ్యాధి తీవ్రత కారణంగా ఇటీవల ఈ పథకాలను దేవస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మళ్లీ వీటిని పునః ప్రారంభిస్తోంది. దానంగా ఇచ్చే ఆవులు, దూడలతో పాటు గతంలో వాటికి గాలి కుంటు, ముద్దచర్మ వ్యాధులు సోకలేదని మండల పశువైద్యాధికారి ధృవీకరించిన పత్రాన్ని తప్పనిసరిగా తీసుకొచ్చి ఇవ్వాలని సూచించారు.
భీమవరం: జిల్లాలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఎలాంటి టార్గెట్లు పెట్టలేదని జిల్లా అబ్కారీ శాఖాధికారి కెవీఎన్ ప్రభుకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం వ్యాపారులు అమ్మకాలకు సరిపడా స్టాక్‌ను డిపోల నుంచి కొనుగోలు, అన్ని రకాల స్టాక్ ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల మద్యం, కల్తీ మద్యం షాపుల్లో అమ్మకుండా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. కల్తీ మద్యం విక్రయాలను అడ్డుకోడానికి ప్రభుత్వం సురక్షయాప్‌ను అందుబాటులోని తీసుకొచ్చినట్లు వివరించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ఉప్పు నీటి ఆక్వా చెరువులు తప్పనిసరిగా సీఏఏ కింద రిజిస్టర్ కావాలని, కాని చెరువులకు చట్టబద్ధత లేకపోతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ(సీఎఎ) రిజిస్ట్రేషన్‌కు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే బ్రాకిష్ ఆక్వాసాగు నిర్వహించాలని, నిబంధనలను పాటించిన వారి సాగుకు గుర్తింపు నమోదు చేయరని చెప్పారు. రిజిస్ట్రేషన్ కాల పరిమితి ఐదు సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత ఎవరూ రెన్యువల్ చేయించుకోకపోవడంతో ప్రస్తుతం సుమారు 100 మంది మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావలసిన దరఖాస్తులు, డాక్యుమెంట్లు గురించి వివరించారు. సమావేశంలో మత్స్య శాఖ అధికారి పి.సురేష్, ఆర్డీవోలు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


