
పశువుల పాల ఉత్పత్తిపై ప్రభావం
జంగారెడ్డిగూడెం: పశువులకు వచ్చే ముద్ద చర్మ వ్యాధి (లుంపీ స్కిన్ డిజీస్) పాల ఉత్పత్తిపై అధిక ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల చర్మంపై ముద్దలు, గడ్డలు ఏర్పడుతాయి. ఈ వ్యాధి వల్ల పశువులు చాలా ఇబ్బందులు పడతాయి. వీటి నివారణకు పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఏటా టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ వివరించారు.
వ్యాధి లక్షణాలు
● పశువుల శరీరంపై చిన్న గడ్డలు, ముద్దలు ఏర్పడతాయి.
● అధిక జ్వరం వచ్చి, బలహీనంగా, అలసటగా కనిపిస్తాయి.
● ఆహారం తీసుకోకపోవడం లేదా తక్కువగా తీసుకుంటాయి.
● ఈ వ్యాధి సోకిన పశువులు తక్కువ పాలు ఇస్తాయి.
వ్యాధి వ్యాప్తి, నివారణ
ముద్ద చర్మ వ్యాధి వైరస్ దోమలు, ఇతర కీటకాల కారణంగా వ్యాపిస్తుంది. వ్యాధి ఉన్న పశువుల నుంచి ఇతర పశువులకు ఈ వ్యాధి వేగంగా వస్తుంది. గోట్ పాక్స్ వైరస్ వ్యాక్సిన్ వలన ఈ వ్యాధి నివారణ సాధ్యమవుతుంది. పశువులకు ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏటా వ్యాక్సిన్‌ను అందిస్తుంది,
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● పశువుల నివాస ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలి.
● వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుంచి వేరుగా ఉంచాలి.
● పశువులకు దోమల నుంచి రక్షణ కల్పించాలి. సమయానికి వ్యాక్సిన్ వేయించాలి
● ఏదైనా లక్షణాలు గమనిస్తే వెంటనే స్థానిక వెటర్నరీ వైద్యులను సంప్రదించాలి.
పాడి – పంట
జాగ్రత్తలతో వ్యాధిని నివారించవచ్చు
ముద్ద చర్మ వ్యాధి పశువులకు ప్రమాదకరమైనది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధిని నివారించవచ్చు. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న గోట్ పాక్స్ వైరస్ వ్యాక్సిన్ వినియోగిస్తే, ఈ వ్యాధి నుంచి పశువులను కాపాడుకోవచ్చు. ప్రతి రైతు పశువైద్యాధికారుల సలహాలు పాటించి తమ పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
– బీఆర్ శ్రీనివాసన్, పశువైద్యాధికారి

పశువుల పాల ఉత్పత్తిపై ప్రభావం

పశువుల పాల ఉత్పత్తిపై ప్రభావం