
శిశు జనన రేటుపై అవగాహన కల్పించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జూలై 11న నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం దంపతులు ఒక బిడ్డతో సరిపెట్టుకుంటున్నారని దానివల్ల భవిష్యత్తులో యువ జనాభా తగ్గిపోతుందన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణులు కాన్పులు చేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణులకు అవసరమైన మందులు, వైద్య చికిత్స, పౌష్టికాహారం ఉచితంగా అందిస్తామని, వీటిని క్రమం తప్పకుండా అందించేందుకు వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కౌమార దశలో వివాహం, గర్భం దాల్చడంతో వచ్చే ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. పదిమంది తల్లులకు నగదు పురస్కారాలను, అందించారు.
సాగునీటి సరఫరాపై దిద్దుబాటు చర్యలు
భీమవరం: జిల్లాలో సార్వా నాట్లు ఆలస్యం, నారుమళ్లు ఎండిపోవడంపై అధికారులు దృష్టిసారించారు. అనేక మండలాల్లో వరి నారుమళ్లు ఎండిపోతున్న వైనాన్ని పత్రికల్లో ప్రచురించడంతో కలెక్టర్ బుధవారం కలెక్టరేట్‌లో పంట పొలాలకు సాగునీటి సరఫరాపై ఇరిగేషన్, డ్రెయిన్లు, ఎర్రకాలువ, గోదావరి హెడ్ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని శివారు భూములకు సైతం సాగునీరు అందించడానికి జల వనరుల శాఖాధికారులు నిరంతరాయంగా నీటి సరఫరాను పర్యవేక్షించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.