
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
భీమవరం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడె విజయలక్ష్మి మండిపడ్డారు. శనివారం భీమవరంలో జరిగిన మహిళా కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాకినాడ రంగరాయ కళాశాల పారా మెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై అధికారులు పొంతన లేని సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. ఎందరో ఉద్యోగిను లు బయటకు చెప్పలేక వేధింపుల వేదన అనుభవిస్తున్నారన్నారు. ల్యాబ్ అసిస్టెంట్ కల్యాణ చక్రవర్తి మహిళల ఫొటోలు తీసి బయటకు పంపడంతో పాటు, వీటి ద్వారా మహిళలను బెదిరించడం అత్యంత దారుణమన్నారు. లైంగిక వేధింపుల బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా హోం మంత్రి చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో జరిగిన కీచక పర్వమని మండిపడ్డారు. మహిళలు మీద చేయి వేస్తే తాటా తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. 50 మంది మహిళలను నెల రోజుల నుంచి వేధిస్తే ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే మహిళా లోకం ఉద్యమిస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై అధిక భారాలను మోపుతోందని, గ్యాస్‌పై రూ.50 పెంచిందన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. గిడుతులూరి రత్నం, భోగిరెడ్డి మంజుల, కె.విజయలక్ష్మి, కోడే భారతి పాల్గొన్నారు.