
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: మున్సిపల్ పర్మినెంట్, అప్కాస్ ఔట్ సోర్సింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణం నెరవేర్చాలని లేకుంటే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని మునిసిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శి తాడికొండ శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు హెచ్చరించారు. కార్మికుల హక్కుల సాధనకు చేపట్టిన దశల వారీ ఆందోళనల్లో భాగంగా శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌ను ముట్టడించి, ధర్నా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, రంగారావు మాట్లాడుతూ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ సెక్షన్‌లో పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికులకు పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న మునిసిపల్ ఇంజినీరింగ్, పారిశుధ్య కార్మికుల కనీస వేతనం రూ.35 వేలకు పెంచాలని లేకుంటే సమాన పనికి సమాన వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లకు అందచేశారు.