
గిట్టుబాటు ధర కోసం పోరాటం
జంగారెడ్డిగూడెం: వర్జీనియా రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కోసం పోరాటం చేద్దామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అన్నారని వైఎస్సార్‌సీపీ నాయకుడు ఘంటశాల గాంధీ అన్నారు. మంగళవారం వర్జీనియా పొగాకు సంఘం రైతు నాయకుడు, వైఎస్సార్‌సీపీ నేత గాంధీ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ వర్జీనియా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గాంధీ మాట్లాడుతూ వర్జీనియా పొగాకుకు మంచి ధర ఇప్పించేందుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. స్పందించిన జగన్‌మోహన్‌రెడ్డి వీలును బట్టి మరోసారి వర్జీనియా వేలం కేంద్రాలను సందర్శిస్తానని తెలిపారన్నారు. గిట్టుబాటు ధర కోసం పోరాటం చేద్దామని జగన్ పేర్కొన్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో బండారు సూరిబాబు, బుద్దాల సత్యనారాయణ, బండారు రత్నవల్లి ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగ కార్యదర్శిగా మోషే
తాడేపల్లిగూడెం (టీఓసీ): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తాడేపల్లి మోషేను రాష్ట్ర ఎస్సీ విభాగ సెక్రటరీగా నియమించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.
ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు గడువు పొడిగింపు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీని పొడిగించినట్లు డీఈవో ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, స్థానిక సంస్థల, మున్సిపల్, ఏపీ మోడల్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు అర్హులన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి తొలుత ఈ నెల 15వ తేదీ వరకూ గడువు ఇవ్వగా, గడువును ఈ నెల 17 వరకు పొడిగించారని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు అర్హులు కారని, సంబంధిత సంవత్సరంలో కనీసం నాలుగు నెలలు విధులు నిర్వహించిన వారు ఇతర అర్హతలన్నీ పూర్తిగా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
నైట్ వాచ్‌మెన్ల జీతాలు చెల్లించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ పాఠశాలలలో రాత్రిపూట కాపలాదారుగా పనిచేస్తున్న నైట్ వాచ్‌మెన్ జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నైట్ వాచ్‌మెన్ జీతాలు చెల్లించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బుచ్చిబాబు మాట్లాడుతూ నైట్ వాచ్‌మెన్‌ల గౌరవ వేతనం నెలల తరబడి చెల్లించడం లేదని విమర్శించారు. దీంతో వారి కుటుంబాల జీవనం చిన్నాభిన్నం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతం తక్కువ పని ఎక్కువ చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించాలి
ఏలూరు (టూటౌన్): విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపును ప్రజలంతా వ్యతిరేకించాలని వామపక్ష, ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ మంగళవారం ఉదయం ఏలూరు సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో వామపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించారు. ఈ నెల 13న విజయవాడ దాసరి భవన్‌లో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమ కార్యాచరణను కృష్ణ చైతన్య వివరించారు. గత కొంతకాలంగా విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు, ఇతర అదనపు చార్జీల పేరుతో అధిక భారాన్ని మోపుతూ వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై మోపిన అధిక భారాలను రద్దు చేయాలని, వసూలు చేసిన అదనపు బిల్లులను తిరిగి చెల్లించాలని, విద్యుత్తు స్మార్ట్ మీటర్లు బిగింపు కార్యక్రమాన్ని విడనాడాలని డిమాండ్ చేశారు.