
కూటమి మోసాలను ఎండగట్టాలి
భీమవరం: కూటమి నాయకులు ప్రజలను మోసం చేయడంలో సిద్ధహస్తులని, వారి మోసాలను ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పిలుపునిచ్చారు. భీమవరం మండలం రాయలంలో పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు అధ్యక్షతన జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయడం, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కష్టించి పనిచేయాలని అలా పనిచేసినవారికి తప్పక గుర్తింపు ఉంటుందని ప్రసాదరాజు స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకులు పెట్టే కేసులు, ఇబ్బందులకు భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని గ్రామ, వార్డుస్ధాయిలో పార్టీ పదవుల నియామకాలు పూర్తిచేసి పటిష్టంగా పార్టీ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు.
ఆక్వాను పట్టించుకోరా?: మురళీకృష్ణంరాజు
పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా రంగం నిర్వీర్యమైపోతున్నా పట్టించుకున్న నాథుడే లేడని కూటమి పాలనలో ఏవర్గం ప్రజలకు మంచి జరగలేదన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అనేక సంక్షేమ అధివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తే నేటి కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల సొమ్మంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల మాట్లాడుతూ జగన్ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలియచేయాలన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు మేడిది జాన్సన్, కామన నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో అప్పులు కుప్పలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమి లేదని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ కాండ్రేగుల నర్సింహరావు, ఎంపీపీ పేరిచర్ల నర్సింహరాజు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, యూత్ అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, భీమవరం పట్టణ, వీరవాసరం, భీమవరం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, చవ్వాకుల సత్యనారాయణ, జల్లా కొండయ్య, పార్టీ నాయకులు పాలవెల్లి మంగ, ఇంటి సత్యనారాయణ, నాగరాజు శ్రీనివాసరాజు, కోడే యుగంధర్, నేతల జ్ఞానసుందరరాజు, పెనుమాల నర్సింహస్వామి, మద్దాల అప్పారావు, తిరుమాని ధనుంజయ, షేక్ రబ్బాని, రాజా బాలమస్తానయ్య, అల్లూరి రవిరాజు, మానుకొండ ప్రదీప్, డీవీడీ ప్రకాష్, పేరిచర్ల సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
భీమవరంలో ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు