ముసురు పట్టాల్సిన సమయంలో వర్షం జాడే లేకుండా పోయింది. జూలై నెలలో సాగు పనులు జోరుగా సాగుతాయి. ఈ నెలలో 96.5 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇంతవరకు సగం కూడా కురవలేదు. మండు వేసవిని తలపిస్తూ ఎండలు మండిపోతున్నాయి. పగలు ఎండ, రాత్రిళ్లు ఉక్కపోతతో ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ పనులకు ఆటంకం ఏర్పడింది.
సాక్షి, భీమవరం: ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలోనే వచ్చినా ప్రతికూల వాతావరణం వెంటాడుతోంది. గత నెల్లో దంచి కొట్టిన వర్షాలు జూలైలో పత్తాలేకుండా పోయాయి. వాతావరణశాఖ లెక్కల ప్రకారం మే నెలలో జిల్లాలో 72.6 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా రికార్డుస్థాయిలో 139 మి.మీ వర్షం కురవడం గమనార్హం. సాధారణం కంటే 66.4 మి.మీ అధిక వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో 110.4 మి.మీ సగటు వర్షపాతానికి 125.5 మి.మీ వర్షంతో 15.1 మి.మీ అధిక వర్షపాతం నమోదైంది. ఈ రెండు నెలల్లో అవసరం లేని సమయంలో అధిక వర్షాలు మామిడి రైతులను నిండా ముంచాయి. పండుఈగ వ్యాప్తితో ధర పతనమై నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మే, జూన్ నెలల్లో తాడేపల్లిగూడెం, పెంటపాడు, ఆకివీడు, మొగల్తూరు, భీమవరం, పెనుగొండ, పాలకొడేరు, ఇరగవరం, వీరవాసరం, పాలకొల్లు, గణపవరం మండలాల్లో సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదైంది.
అవసరమైన సమయంలో.. తొలకరి పనులకు ఊతమిస్తూ ఈ నెలలో విస్తారంగా వానలు కురవాల్సి ఉంది. జూలై నెలకు 96.5 మి.మి వర్షం పడాలి. అప్పుడే సగం నెల పూర్తికాగా ఇప్పటి వరకు కేవలం 25.5 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. జిల్లాలోని అత్తిలి, పెనుమంట్ర, పెనుగొండ, పాలకోడేరు, ఆకివీడు, అత్తిలి, తాడేపల్లిగూడెం, పెంటపాడు తదితర మండలాల్లో ఈ నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈశాన్య ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం, ద్రోణి వలన వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు.
తొలకరికి ఆటంకం
వర్షాభావ పరిస్థితులతో తొలకరి పనులకు ఆటంకం ఏర్పడుతోంది. 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగనుంది. నవంబరు చివరలో వచ్చే తుఫాన్ల బారిన పడకుండా ముందుగానే పంటను ఒబ్బిడి చేసుకునేందుకు జూలై 15లోగా నాట్లు పూర్తిచేయాల్సి ఉండగా ఈ సీజన్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. క్లోజర్ పనుల జాప్యం, ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందకపోవడం, వర్షాలు లేక సాగునీటి ఎద్దడి సమస్యలతో పనులు ముందుకు సాగడం లేదు. ముందస్తు సాగులో భాగంగా ఈపాటికే నాట్లు దాదాపు పూర్తి కావాల్సి ఉంది. పెనుగొండ, పోడూరు, ఆచంట, యలమంచిలి తదితర మండలాల్లో 30 శాతం విస్తీర్ణంలో ఇంకా దమ్ములు కూడా చేయని పరిస్థితి ఉంది. కాలువలకు సరిగా నీరు విడుదల కాకపోవడం, ఎండల తీవ్రతకు నారుమడులు ఎండిపోతున్నాయని, పొలాలు నెరలు తీస్తున్నాయని ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు వాపోతున్నారు. కాగా జిల్లాలో నారుమడులు పోయడం దాదాపు పూర్తయ్యిందని, ఇప్పటి వరకు 31 వేల ఎకరాల్లో నాట్లు పడినట్టు జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు తెలిపారు.
38 డిగ్రీల ఉష్ణోగ్ర తతో వేసవిని
తలపిస్తున్న ఎండలు, ఉక్కపోత
ఈ నెలలో సాధారణ వర్షపాతం 96.5 మి.మీ.. కురిసింది 25.5 మి.మీ
వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ పనులు నత్తనడక
31 వేల ఎకరాల్లో మాత్రమే పూర్తయిన నాట్లు
30 శాతం విస్తీర్ణంలో మొదలుకాని తొలకరి దమ్ములు
జాడలేని వానలు